ఇంట్లో కూర్చుంటే దిగొస్తారా.?

పవన్‌కళ్యాణ్‌ ఇంట్లో కూర్చుంటే పనైపోతుంది. నచ్చితే సినిమాలు చేయొచ్చు, లేదంటే మానెయ్యొచ్చు. ఎంచక్కా ఫామ్‌ హౌస్‌లో కూర్చుని పవన్‌కళ్యాణ్‌ వ్యవసాయం చేసుకోవడానికి వీలుంది. కానీ, ప్రజా పోరాటాలు అలా వుండవు కదా. ప్రజలు రోడ్డెక్కితే తప్ప, పాలకులు కళ్ళు తెరవని రోజులివి. అధికారంలో వున్నవారే కాదు, ప్రజా ప్రతినిథులన్నాక ప్రజల్ని మర్చిపోవడం అనేది ఇప్పుడు పరమ రొటీన్‌ వ్యవహారం. 

ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కాల్సిందే. రోడ్డెక్కితే తప్ప, నాయకుల మొద్దు నిద్ర వదలదు. కానీ, మన పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌, ప్రజల్ని రోడ్డెక్కొద్దంటున్నారు. టీడీపీ ప్రజా ప్రతినిథులున్నారు, బీజేపీ ప్రజా ప్రతినిథులున్నారు, వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిథులన్నారు.. వాళ్ళంతా పోరాటం చెయ్యాలి.. మీరు ఎంచక్కా చదువుకోండి.. మీ తల్లిదండ్రుల్ని చూసుకోండి.. అంటూ కాకినాడ సభ ద్వారా పవన్‌కళ్యాణ్‌ పిలుపునిచ్చాడు. 

ఎంత చక్కటి పిలుపునిచ్చావయ్యా పవన్‌కళ్యాణ్‌.! అవును మరి, ప్రజలు తిరగబడితేనే తప్ప తోలుమందం రాజకీయ నాయకులు కళ్ళు తెరవడంలేదాయె. ఒక్కసారి పదవి వస్తే చాలు, ఇక ప్రజల్ని నాయకులు మర్చిపోతున్న రోజులివి. ప్రజల తరఫున ఎవరో ఒకరు పోరాడకపోతే, అసలు ప్రజలన్నవారే వున్నారన్న విషయం నాయకులు మర్చిపోతున్న నయా రాజకీయాలివి. 

పవన్‌కళ్యాణ్‌ వస్తాడు.. మన మందు నిలబడి పోరాడతాడు.. అని ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకం ఎదురుచూస్తోంటే, మీరు ఉద్యమాలు చేయొద్దు.. మీరు బంద్‌లు చేయొద్దు.. ప్రజా ప్రతినిథులు వున్నార్లే పోరాటాలు చేసేందుకు.. అని పవన్‌ నినదించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.? 'ఆయనే వుంటే.. డాష్‌ డాష్‌తో పనేంటి..' అనే ముతక సామెత చెప్పినట్లు.. ప్రజా ప్రతినిథులే సరిగ్గా వుంటే, జనం రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వస్తుందట.?

Show comments