రజనీకాంత్‌ పొలిటికల్‌ యుద్ధం

యుద్ధం తప్పదు.. చెయ్యాల్సిందే.. కానీ, యుద్ధం వచ్చినప్పుడే యుద్ధం చెయ్యాలి.. 

- ఇది సినిమా డైలాగ్‌ కాదు. రజనీకాంత్‌ తాజా ప్రకటన. రాజకీయాల్ని ఆయన యుద్ధంతో పోల్చారు. ఆయన ఉద్దేశ్యం, 'ఎన్నికలు - యుద్ధం' కావొచ్చుగాక.! 

ఐదో రోజు అభిమానులతో భేటీ సందర్భంగా రాజకీయాలపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలో మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. నలభయ్యేళ్ళుగా తాను తమిళనాడులోనే వుంటున్నానని చెప్పుకొచ్చారు. గతంలో రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు, ఆ వ్యాఖ్యలు అంత పెద్ద వివాదాస్పదమవుతాయని తాను అనుకోలేదన్నారు. రాజకీయాల్లో మార్పు అవసరం అన్నారు. రాజకీయాల్లో మార్పు తీసుకొద్దాం.. అని అభిమానులకు పిలుపునిచ్చారు. 

అయితే, ఇక్కడ కండిషన్స్‌ అప్లయ్‌. అవును, షరతులు వర్తిస్తాయి. ఆ షరతులు ఏంటంటే, యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే యుద్ధం చేయాలి. ఇది రజనీకాంత్‌ మాట. అయితే, రాజకీయం యుద్ధమే కావొచ్చు. అది నిరంతర ప్రక్రియ. ఎన్నికలొచ్చినప్పుడే రాజకీయం చేస్తామంటే, అలా చేస్తామనేవారు నాయకులు కాలేరు. రాజకీయ పార్టీ పెట్టడమో, ఏదన్నా రాజకీయ పార్టీలో చేరడమో చేస్తే, ఆ తర్వాత ప్రజల తరఫున నిలబడితే.. అదీ రాజకీయం అవుతుంది. 

సినిమా రిలీజ్‌ అయ్యాక తెరపై చూడటం.. అనుకుంటున్నారేమో ఈ తమిళ సూపర్‌ స్టార్‌. సినిమా వచ్చినప్పుడు చూడండి.. అని అభిమానులకు చెప్పినట్లుగా, యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చేద్దామని రజనీకాంత్‌ వ్యాఖ్యానించడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఒక్కటి మాత్రం క్లియర్‌. రజనీకాంత్‌ రాజకీయాలపై ఆసక్తి వుంది. పార్టీ పెట్టాలనే ఆలోచన వుంది. కానీ, అదెప్పుడో తెలియదు. తన రాజకీయ గమనాన్ని తానే నిర్దేశించుకోలేకపోతున్న రజనీకాంత్‌, యుద్ధం ఎలా చేస్తారు.? ఎలా యుద్ధంలో పాల్గొనమని అభిమానులకు పిలుపునిస్తారు.?

Show comments