రాష్ట్రపతి ఆవేదన.. దేశానికి దిక్కెవరు.?

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీనే, చట్ట సభల నిర్వహణపై ఆవేదన వ్యక్తం చేస్తే.. ఇక దేశానికి దిక్కెవరు.? చట్ట సభల్లో తమకు న్యాయం జరగలేదని విపక్షాలు భావిస్తే, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడం ఆనవాయితీ. అఫ్‌కోర్స్‌, రాష్ట్రపతి తన విశేషాధికారాల్ని ఉపయోగించడం, తద్వారా అధికార పార్టీకి షాక్‌ ఇవ్వడం 'చాలా చాలా చాలా చాలా' అరుదుగా జరిగే విషయమేననుకోండి.. అది వేరే విషయం. 

జాతీయ స్థాయిలో అయితే రాష్ట్రపతి, రాష్ట్ర స్థాయిలో అయితే గవర్నర్‌.. జస్ట్‌ 'పేపర్‌ వెయిట్‌' అనే వాదన ఒకటుంది. కానీ, కొన్ని సందర్భాల్లో గవర్నర్‌, రాష్ట్రపతి చాలా యాక్టివ్‌గా వ్యవహరిస్తుంటారు. అయితే, ఆ సందర్భాలు నూటికో కోటికో ఒక్కసారి మాత్రమే. చట్ట సభల నిర్వహణ దేశంలో అత్యంత అధమ స్థాయికి దిగజారిపోయిందన్నది నిర్వివాదాంశం. ఈ దారుణానికి బాధ్యత వహించాల్సిందెవరు.? అని ప్రశ్నిస్తే పాలక - ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే తప్ప, సమాధానం దొరకదు. 

ఇటు పాలక పక్షం, అటు విపక్షాలు.. కలిసి కట్టుగా చట్ట సభల్ని అభాసుపాల్జేస్తున్నాయి. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. మొన్నటికి మొన్న ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ జరిగే సమయంలో, అధికార బీజేపీ ఎంతలా రచ్చ చేసి, సమయాన్ని వృధా చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధికార పార్టీ ఇంత నీఛానికి ఒడిగట్టాక, విపక్షాలు ఎందుకు ఊరుకుంటాయి.? అఫ్‌కోర్స్‌, ఇదిప్పుడు కొత్తగా వచ్చిన తంతు ఏమీ కాదనుకోండి. అయినాసరే, 'మార్పు' రావాలి కదా.!

వ్యవస్థలో మార్పు రావాలంటే, ముందుగా ఆ మార్పు రాజకీయాల నుంచే మొదలవ్వాలి. దేశంలో చెత్తను ఊడ్చేస్తాం.. ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం.. అనడం కాదు, ప్రధాని నరేంద్రమోడీకి నిజంగానే చిత్తశుద్ధి వుంటే, ప్రక్షాళన చట్ట సభల నుంచి మొదలు పెట్టి వుండాల్సిందే. పార్టీ ఫిరాయింపుల దగ్గర్నుంచి, చట్ట సభల నిర్వహణదాకా.. రాజకీయం దిగజారుడుతనంలో పరాకాష్టకి వెళ్ళిపోయింది. 

ఈ దఫా పార్లమెంటు సమావేశాల్నే తీసుకుంటే, కీలకమైన ఐటీ చట్ట సవరణ బిల్లు లోక్‌సభలో పాస్‌ అయిపోయింది. కానీ, లోక్‌సభలో ఇంకే ఇతర అంశమ్మీదా జరగాల్సిన చర్చ మాత్రం జరగలేదు. అంటే, అధికార పార్టీ కావాలనుకుంటే ఏమైనా చేయగలదు.. లేదంటే మాత్రం సభను జరగనియ్యదన్నమాట. ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ప్రధాని నరేంద్రమోడీ పెద్దనోట్ల రద్దు వ్యవహారంపై పార్లమెంటులో పెదవి విప్పకపోవడమే ఇంత గందరగోళానికి కారణం. 

విపక్షాల రచ్చ మామూలే.. అధికార పక్షమే బాధ్యతగా వ్యవహరించాలి. కానీ, మోడీ సర్కార్‌ బాధ్యతను విస్మరించింది.. చట్ట సభల్ని భ్రష్టుపట్టించేస్తోంది. ఈ విషయం సాక్షాత్తూ బీజేపీ సీనియర్‌ నేత అద్వానీ మాటల్లోనే వ్యక్తమవుతోంది. తాజాగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట సభల్లో ప్రక్షాళనకు ఇదే తగిన సమయం. లేదంటే, మనది అతి గొప్ప ప్రజాస్వామ్యదేశం.. అని చెప్పుకోడానికే సిగ్గుపడే రోజొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు.

Show comments