కోన మెలికకు ఎమ్వీవీ కుదేలు

కోనవెంకట్ సినిమాల్లో భలే మెలికలు వుంటాయి. హీరోలు స్కీముల మీద స్కీములు వేసి విలన్ ను ఆట పట్టించి, మూల కూర్చో బెడుతుంటారు. ఇప్పుడు అచ్చంగా అలాంటి స్కీమ్ నే నిర్మాత, తన పార్టనర్ ఎమ్ వి వి సత్యనారాయణ మీద కోన వెంకట్ ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ దెబ్బకు పాపం, మంచి ప్రాజెక్టును ఎమ్ వి వి సత్యనారాయణ చేజార్చుకున్నట్లు తెలుస్తోంది. 

ఇంతకీ విషయం ఏమిటంటే, గీతాంజలి సినిమా దగ్గర నుంచి విశాఖకు చెందిన బడా బిల్డర్ ఎమ్ వి వి సత్యనారాయణ కు రచయిత కోన వెంకట్ కు దోస్తీ కుదిరింది. పెట్టుబడి మొత్తం ఎమ్ వి వి ది, ఎగ్జిక్యూషన్, ప్రాజెక్టులు సెట్ చేయడం కోన వెంకట్ పని. దానికి గాను, పెట్టుబడి లేకుండానే కోన వెంకట్ కు బిజినెస్ లో షేర్. ఇదీ వ్యవహారం. అలాగే గీతాంజలి, శంకరాభరణం, అభినేత్రి చేసారు. శంకరాభరణం ముందు టేబుల్ ప్రాఫిట్ అయినా, విడుదలయిన తరువాత బయ్యర్లకు నిర్మాత డబ్బులు వెనక్కు ఇచ్చుకోవాల్సి వచ్చింది. అభినేత్రిలో కొటి రూపాయిల వరకు హుష్ కాకి అయింది. 

అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ మాంచి కథను ఎమ్ వి వి పార్టనర్ ఒకరు పట్టుకువచ్చారట. అది ఎమ్ వి వి యేమో కోన దృష్టికి తెచ్చారు. నాని హీరోగా అయితే బాగుంటుంది అని చెప్పి, ఆ లైన్ నానికి వినిపించారట. వెంటనే నాని ఓకె అన్నారట. అంతవరకు బాగానే వుంది. కానీ వన్ ఫైన్ మార్నింగ్, ఎమ్ వి వి లాంటి చిన్న బ్యానర్ లో చేయనని నాని అంటున్నారని, అందువల్ల మరో పెద్ద బ్యానర్ తోడు చేసుకుందామని కోన వెంకట్ ఎమ్ వి వి కి చెప్పారట. తప్పనిసరై ఊ అనకతప్పలేదట. అప్పుడు నిర్మాత డివివి దానయ్యను కోన వెంకట్ సీన్లోకి తెచ్చారట. ఇద్దరు కలిసి చేసుకుంటే బాగుంటుంది, బ్యానర్ వాల్యూ తోడవుతుందని అన్నారట. ఆ మేరకు ఎమ్ వి వి ఎనభై లక్షల వరకు తన వంతుగా ఇచ్చుకుంటూ వచ్చారట. 

ఇంతలో కథ మరో మలుపు తిరిగిందని ఎమ్ వి వి ఘొల్లు మంటున్నారు. ఎమ్ వి వి బ్యానర్ పై మంచు విష్ణుతో సినిమా చేస్తున్నారని, అందువల్ల తాను ఆ బ్యానర్ లో సినిమా చేయనని నాని అంటున్నారని, అందువల్ల దానయ్య బ్యానర్ పైనే సినిమా చేద్దామని, మీరు సైలెంట్ పార్టనర్ గా వుండమని కోన వెంకట్ చావు కబురు చల్లగా చెప్పారట. దాంతో బిత్తరపోవడం ఎమ్ వి వి వంతయిందట. ఇంత వరకు తమ బ్యానర్ కు బ్యాడ్ నేమ్ లేదని, పైసా ఫైనాన్స్ అవసరం లేకుండా సినిమాలు చేస్తున్నామని, ఎవరికీ రూపాయి ఎగ్గొట్టలేదని, విష్ణుతో సినిమా చేస్తున్నంత మాత్రాన తమతో సినిమా చేయమని నాని అనడం నిజమా? కాదా? అని ఇప్పుడు ఎమ్ వి వి మధనపడుతున్నారు. 

తను తెచ్చుకున్న కథ, మంచి ప్రాజెక్టు ఇలా వేరే వాళ్లకు వెళ్లిపోవడం సబబేనా? అని ఆయన ఆవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు దృష్టికి, నాని దృష్టికి కూడా తీసుకువెళ్లాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.  ప్రాజెక్ట్ అగ్రిమెంట్లు అన్నీ దానయ్య పేరిటే చేయించారని, తాము ఎనభై లక్షల వరకు పెట్టుబడి అందించామని ఎమ్ వి వి సినిమా వర్గాలు వెల్లడించాయి. డబ్బులు పెట్టడం, వెనక్కు తీసుకోవడం సమస్య కాదని, తమ బ్యానర్ కు వాల్యూ లేదనడం, మరో హీరోతో సినిమా చేస్తుంటే, తాను చేయనని నాని అన్నారు అనడం తమకు మింగుడు పడడం లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా వుంటే ఈ విషయమై నిర్మాత దానయ్యను సంప్రదిస్తే, తనకు అవన్నీ తెలియవని, నాని, కోన వెంకట్ ఈ ప్రాజెక్టు తనకు అప్పగించారని అన్నారు. మొత్తానికి సినిమాల్లోనే కాదు, సినిమా నిర్మాణాల వెనుక కూడా కథలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై హీరో నాని, కోన వెంకట్ ఏమంటారో మరి? 

Show comments