ఒకటి మొదలైంది...ఇంకోటి ఎప్పుడో....!

తెలంగాణలో ప్రతిపక్షాలది ఒక్కటే ధ్యేయం. టీఆర్‌ఎస్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడగొట్టాలి. కేసీఆర్‌ను అధికారానికి దూరం చేయాలి. ఇందుకోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఇప్పటికైతే 'అధికారం మాదే' అంటూ కాంగ్రెసు, బీజేపీ, టీడీపీ రంకెలు వేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కూటమి కట్టేందుకు కూడా ఆలోచనలు సాగుతున్నాయి. ఏ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చెప్పలేం. ఇదిలా కొనసాగుతుండగానే తెలంగాణ ఆవిర్భావ వేడుకల రోజునే టీఆర్‌ఎస్‌ మాజీ నాయకుడు చెరుకు సుధాకర్‌ నేతృత్వంలో 'తెలంగాణ ఇంటి పార్టీ' పేరుతో ఓ రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది.

విచిత్రమైన పేరున్న ఈ పార్టీ ఎంత బలంతో పుట్టిందో తెలియదుగాని సుధాకర్‌ మాటలు మాత్రం ధాటిగా ఉన్నాయి. 'పిట్ట కొంచెం..కూత ఘనం' అన్నట్లుగా ఆయన, ఇతర నాయకులు మాట్లాడారు. 'భవిష్యత్తు రాజకీయాలను శాసిస్తాం' అని చెరుకు సుధాకర్‌ అన్నారు. ఈ పని ఎంతవరకు జరుగుతుందో కొంతకాలం తరువాత తెలుస్తుంది. బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని కూడా ప్రతిజ్ఞ చేశారు. పార్టీ ఆవిర్భావ సభలో ఈమాత్రం మాట్లాడకపోతే ఎలా?

రాజకీయాలను శాసించడం, బీసీని సీఎం చేయడం కంటే ముందు పార్టీ మనుగడ సజావుగా సాగేలా చూసుకోవాలి. బలం పుంజుకోవాలి. సరైన నాయకత్వం ఉండాలి. మఖలో పుట్టి పుబ్బలో పోయిన పార్టీలను చాలా చూశారు జనం. ఆ జాబితాలో ఇంటి పార్టీ చేరకుండా చూసుకోవాలి. చెరుకు సుధాకర్‌ ఒకప్పుడు కేసీఆర్‌కు సన్నిహితుడు. ఉద్యమంలో పాల్గొన్నవాడు. టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడు.

కాని అధినేతతో విభేదాలొచ్చాయి. 2014 మార్చిలో పార్టీని వీడారు. ఇందుకు ప్రధాన కారణం నకిరేకల్‌ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీఆర్‌ఎస్‌ టిక్కెట్టు లభించకపోవడమేనని సమాచారం. ఇంకా ఇతర కారణాలు ఏమున్నాయో తెలియదు. వృత్తిరీత్యా వైద్యుడైన సుధాకర్‌ టీఆర్‌ఎస్‌కు ఎలాంటి ఆపరేషన్‌ చేస్తారో...! టీఆర్‌ఎస్‌కు పాత ప్రతిపక్షాలతోపాటు ఓ కొత్త ప్రతిపక్షం దొరికింది. ఇక ఎన్నికల్లోగా మరో పార్టీ పుట్టాల్సి ఉంది.

ఆ పార్టీ పెట్టబోయేది ఎవరు? మొన్నటివరకు 'ప్రజా యుద్ధనౌక'గా జనం పిలుచుకున్న ప్రజా గాయకుడు గద్దర్‌. దశాబ్దాల తరబడి మావోయిస్టులకు సానుభూతిపరుడిగా, వారికి వీరాభిమానిగా, వారి తరపున వకాల్తా పుచ్చుకొని పోరాటాలు చేసిన గద్దర్‌ తీవ్రవాద ఎర్రబాట సరైన మార్గం కాదని తెలుసుకున్నారు. 'పల్లె పల్లెకు పాట...పార్లమెంటుకు బాట' అనే నినాదం ఎత్తుకున్నారు. 'మహాజన సంఘం' పేరుతో ఓ వేదిక ఏర్పాటు చేశారు. రాజకీయ తెలంగాణ వచ్చిందిగాని బహుజనుల తెలంగాణ రాలేదంటున్నారు.

2019 ఎన్నికల్లోగా రాజకీయ పార్టీ పెడతానంటున్నారు. మొన్నీమధ్య వరంగల్‌ జిల్లాలో పర్యటించినప్పుడు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటవుతుందని చెప్పారు. గాయకుడిగా, రచయితగా గద్దర్‌కు ఎంతటి ప్రాచుర్యం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన పాటలకు బ్రహ్మరథం పట్టిన జనం ఆయన పెట్టబోయే రాజకీయ పార్టీకీ బ్రహ్మరథం పడతారా? ఆయన్ని బలమైన నాయకుడిగా చూస్తారా? ఇందుకు 'అవును' అని సమాధానం చెప్పలేం. కళాకారులకు జనంలో గొప్ప ఇమేజ్‌ ఉన్నప్పటికీ రాజకీయాల్లో ఎదుగుతారనే గ్యారంటీ లేదు. ఇందుకు మెగాస్టార్‌ చిరంజీవి తాజాగా కనబడుతున్న ఉదాహరణ.

ఎన్టీఆర్‌కు సాధ్యపడింది తనకెందుకు సాధ్యపడదని అనుకున్నారు. కాని చివరకు పార్టీయే లేకుండాపోయింది. గద్దర్‌ ఇంకా పార్టీ పెట్టకముందే పవన్‌ కళ్యాణ్‌ సహకారం కోసం అర్రులు చాచారు. ఆయనకు లేఖ కూడా రాశారు. కాని పవన్‌ ఇప్పటివరకు స్పందించిన దాఖలా లేదు. పవన్‌ సినిమా రంగంలో కాలు మోపకముందే గద్దర్‌ ఎంతో పాపులర్‌. అలాంటి వ్యక్తి పవన్‌ సాయం తీసుకోవడమంటే ఒంటరిగా పోరాటం చేయడం సాధ్యం కాదనుకోవాలా?

అసలు ముందు పార్టీ అంటూ పెడితే ఎవరెవరి సహకారంతో టీఆర్‌ఎస్‌పై పోరాటం చేయవచ్చో ఆలోచించుకోవచ్చు. పవన్‌ పార్టీకే ఇప్పటివరకూ ఓ స్వరూపం, రూపు రేఖలు లేవు. అయినప్పటికీ ఆయనతో కలిస్తే రాజకీయంగా మంచిదని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సైతం ఆలోచిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమం సాగుతునప్పుడే కేసీఆర్‌ వ్యతిరేకులు కొందరు ఆయనకు ప్రత్యామ్నాయంగా గద్దర్‌ను తీసుకురావాలనుకున్నారు. కాని ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు. ఇప్పుడు పార్టీ పెడతానంటున్నారు. చూద్దాం ఏం చేస్తారో...!

Show comments