కెప్టెన్‌ విజయ్‌కాంత్‌ కక్కుర్తి.!

తమిళ హీరో విజయ్‌కాంత్‌, పబ్లిసిటీ కక్కుర్తి కోసం రంగంలోకి దిగుతున్నాడు. ఆయన కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, తమిళనాడులో ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా. అదే డీఎండీకే. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన తర్వాత రాజకీయ భవిష్యత్తు అంధకారమైపోయింది. ఈ పరిస్థితుల్లో విజయ్‌కాంత్‌కి 'కావేరీ వివాదం' బంపర్‌ ఆఫర్‌లా తయారయ్యింది. 

కావేరీ జలాలకు సంబంధించి తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వెయ్యకుండానే భగ్గుమంటోన్న విషయం విదితమే. అటు తమిళనాడులో, ఇటు కర్నాటకలో దాడులు జరుగుతున్నాయి. ఈ దాడుల్లో బెంగళూరు మరీ దారుణంగా భగ్గుమంది. ముందుగా తమిళనాడులోని కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి నిర్వహిస్తోన్న హోటల్‌పై దాడి జరిగింది. దానికి ప్రతిగా బెంగళూరులో, తమిళనాడుకు చెందిన వాహనాలు, హోటళ్ళు, ఇతర వ్యాపార సముదాయాలపై దాడులు జరిగాయి. 

ఈ పరిస్థితుల్లో ఎవరైనాసరే సంయమనం పాటించాల్సిందే. మరీ ముఖ్యంగా.. రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు హుందాగా వ్యవహరించాలి. కానీ, అలా చేస్తే పబ్లిసిటీ ఎలా వస్తుంది.? అందుకేనేమో, శవాల మీద పేలాలు ఏరుకోవడానికన్నట్లు.. ఈ వివాదంలో రాజకీయ లబ్దిని ఏరుకోవడానికి విజయ్‌కాంత్‌ రంగంలోకి దిగుతున్నాడు. బెంగళూరులో తమిళులపైనా, తమిళులకు చెందిన వాహనాలు, వ్యాపార సముదాయాలపైనా దాడులు జరగడాన్ని విజయ్‌కాంత్‌ ఖండించేశాడు. 

ఏం, తమిళనాడుకేనా సినిమా స్టార్లు.. పొలిటికల్‌ స్టార్లు.. మాక్కూడా వున్నారంటూ, కర్నాటకలోనూ విజయ్‌కాంత్‌కి వ్యతిరేకంగా ఆందోళనలు షురూ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిన్నటితో పోల్చితే, కాస్త ఈ రోజు ఉద్రిక్తతలు తగ్గిన దరిమిలా.. విజయ్‌కాంత్‌ ఎంట్రీ కొత్త ఆందోళనలు, విధ్వంసాలకు కారణమయ్యేలా వుంది. ముందంటూ పోలీసు అధికారులు సోకాల్డ్‌ పొలిటీషియన్లను, పబ్లిసిటీ స్టంట్‌ మాస్టర్లను కంట్రోల్‌ చేస్తే.. ఆటోమేటిక్‌గా అన్ని వివాదాలూ సద్దుమణిగిపోతాయి. 

కొసమెరుపు: రాజకీయాల్లో ఫెయిలయ్యాక, తిరిగి సినిమాల్లో నటించాలనుకుంటున్న విజయ్‌కాంత్‌కి కావేరి జల వివాదం భలేగా దొరికినట్టుంది కదూ.!

Show comments