బిజెపి, టీడీపీ ట్రాప్‌లో పవన్‌ పడతాడా.?

ఓ పక్క చంద్రబాబు, ఇంకోపక్క వెంకయ్యనాయుడు.. ఇద్దరూ విడివిడిగా జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌తో ఫోన్‌లో మంతనాలు జరుపుతున్నారట. ఎందుకో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడుకోడానికి ఏమీ లేదనీ, ఆ స్థాయిలో ప్యాకేజీ ఇస్తున్నందున ప్రత్యేక హోదా పేరుతో గందరగోళం సృష్టించొద్దనీ పవన్‌కళ్యాణ్‌కి 'డబుల్‌ నాయుడు' విజ్ఞప్తి చేస్తున్నారట. 

పవన్‌కళ్యాణ్‌ కాకినాడలో నిర్వహించనున్న ఆత్మగౌరవ సభ నేపథ్యంలోనే బీజేపీలో అలజడి రేగిందనీ, చంద్రబాబు కూడా ఉలిక్కిపడ్డారనీ, ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో ప్రకటన చేయించారనీ, అయితే ఆ ప్రకటన కాస్తా బూమరాంగ్‌ అయ్యిందనీ ప్రచారం జరుగుతున్న వేళ, పవన్‌కళ్యాణ్‌ - చంద్రబాబు చెప్పినా, వెంకయ్యనాయుడు చెప్పినా వినే పరిస్థితుల్లో వుంటారా.? 

నిజానికిది పవన్‌కళ్యాణ్‌కి బంపర్‌ ఛాన్స్‌. ఏ కాకినాడలో అయితే ఒక ఓటు రెండు రాష్ట్రాలనే తీర్మానం బీజేపీ తొలిసారిగా చేసిందో, అదే కాకినాడ నుంచి ప్రత్యేక హోదా కోసం గట్టిగా ఉద్యమ నినాదం చేసేందుకు ఛాన్స్‌ దొరికింది పవన్‌కళ్యాణ్‌కి. రాజకీయంగా ఎదిగేందుకు బహుశా పవన్‌కళ్యాణ్‌కి ఇంతకన్నా గొప్ప ఛాన్స్‌ ఇంకొకటి దొరక్కపోవచ్చు. అయితే, మొదటి నుంచీ పవన్‌కళ్యాణ్‌ది అనుమానాస్పద వైఖరే. దాంతో పవన్‌కళ్యాణ్‌ అభిమానులు సైతం ఆయన్ని విశ్వసించలేని పరిస్థితి ఏర్పడింది. 

ఇదిలా వుంటే, ఈ పరిస్థితుల్లో పవన్‌కళ్యాణ్‌ వెనక్కి తగ్గకపోవచ్చనీ, చంద్రబాబు చెప్పినా వెంకయ్య చెప్పినా పవన్‌, కాకినాడ బహిరంగ సభ వేదికగా టీడీపీనీ, బీజేపీనీ తనదైన విమర్శలతో చెడుగుడు ఆడేస్తారనీ పవన్‌కళ్యాణ్‌ మద్దతుదారులు చెబుతున్నారు. చిత్రమైన విషయమేంటంటే, కేంద్రం ప్రకటించిందని చెప్పుకుంటున్న ప్యాకేజీ గురించి స్పందించడానికి కూడా జనసేన పార్టీ తరఫున పవన్‌కళ్యాణ్‌ తప్ప ఇంకో దిక్కు కన్పించడంలేదాయె.! 

కాకినాడలో ప్రస్తుతం బస చేసిన పవన్‌కళ్యాణ్‌తో మంతనాల కోసం ఇటు టీడీపీ, అటు బీజేపీ.. కలిసి కట్టుగా ఓ టీమ్‌ని తయారు చేసి, కాకినాడలోనే మోహరించడం గమనార్హం. టీడీపీ, బీజేపీకి చెందిన ముఖ్య నేతలు ఆ టీమ్‌లో వున్నారట. మరి, పవన్‌కళ్యాణ్‌ - టీడీపీ, బీజేపీ నేతల బుజ్జగింపులతో మెత్తబడ్తారా.? వేచి చూడాల్సిందే.

Show comments