సాధారణంగా ఎన్నికల వేళే జనాల చెవులకు కుడి ఎడమల వాయింపు తప్పదు. ఎందుకంటే అన్ని పక్షాల జనాలు చేరి ఆ పార్టీ చెత్త అంటే ఈ పార్టీ చెత్త అని తెగ వాయించేస్తారు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేకుండానే ఆంధ్రలో అలాంటి సీన్ కనిపిస్తోంది. ఆంధ్రలో కొత్త పాలన మొదలై రెండేళ్లయింది. ఈ రెండేళ్లలో అవినీతి తప్ప మరేమీ లేదని ప్రతిపక్ష వైకాపా అంటోంది. అనడమే కాదు, అక్కడితో ఆగకుండా, ఇంటి ఇంటికీ ఈ విషయాన్ని చాటాలని డిసైడ్ అయింది. గడపగడపకు అంటూ జనం ముందుకు పోయి టీడీపీ పరువు బజారును పెట్టే పనికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
మొదట్లో ఈ కార్యక్రమాన్ని లైట్ తీస్కొంది అధికార తెలుగుదేశం పార్టీ. తమ పార్టీకి అనుకూలంగా వుండే మీడియా సహకారం ఎలాగూ వుంటుంది. తమ నాయకుల మాటలే గట్టిగా జనాలకు వినిపించవచ్చు..వైకాపా మాటలు కప్పేయచ్చు అనుకుంది. కానీ మీడియాలో ఫోకస్ కాకపోయినా, ఇంతో అంతో జనంలో ఫోకస్ కావడం కూడా తమకు ఇబ్బందే అని ఇఫ్పుడు గ్రహించినట్లుంది.
అందుకే ప్రచారానికి ప్రచారమే కౌంటర్ అని తెలుగుదేశం పార్టీ డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. వ్యతిరేక ప్రచారానికి ప్రతిగా ఇంటింటికి తాము అందించిన సహకారాన్ని, పథకాలను ప్రచారం చేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ శ్రెణులను ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలను పిలిపించుకుని కార్యక్రమం తయారు చేశారు. ఇక చేయండి అంటూ వీధుల్లోకి వెళ్లమని ఆదేశించారు. అదే తలుపు తలుపుకూ అన్న కార్యక్రమం. ప్రతి తలుపును తట్టండి, బయటకు వచ్చిన ప్రతి వారితో మనం అమలు చేస్తున్న పథకాలను వివరించండి. అభివృద్ధి కోసం తాను చేస్తున్న కష్టమేంటో చెప్పండి అంటూ బాబు పార్టీ శ్రేణులను ముందుకు నడిపించే పనికి దిగారు.
దీంతో ఏపీలో ఇరు పార్టీల వీదిపోరాటం ఇక ముమ్మరం కానుంది. సరే ఏంచేశారో వారు చెప్పుకోవడం, ఏం చేయలేదో వీరు చెప్పడం వరకు ఓకే. ఈ విషయంలో ఇద్దరు కరెక్టే కావచ్చు..ఎందుకంటే జనాలకు ఎంతో కొంత చేసే ప్రయత్నం తెలుగుదేశం చేస్తోంది. పార్టీ కీలక నాయకులు తమ పనులు తాము చక్కబెట్టుకుంటూనే, ప్రజల దృష్టి తమ వ్యవహారంపై పడకుండా, వాళ్లకు ఎంతో కొంత ప్రభుత్వం నుంచి ఏదో విధంగా లబ్ధి ఇప్పించే పని కూడా పెట్టుకున్నారు. అందువల్ల ఇలా చేసాం అని చెప్పడానికి తెలుగుదేశం పార్టీకి అవకాశం వుంది. కానీ చాలా హామీలు అలాగే వున్నాయి. అది చిన్న సమస్యగానే వుండొచ్చు.
ఇక వైకాపాకు కూడా చెప్పడానికి చాలా వుంది. అయితే అదంతా అవినీతి చుట్టూనే తిరుగుతుంది తప్ప వేరు కాదు. దానిని ప్రజలు ఏ మేరకు స్వీకరిస్తారన్నదే సందేహం.మొత్తానికి ఇరు వర్గాల ప్రచారాన్ని జనాలు ఎలా తీసుకుంటారో అన్నది పక్కన పెడితే, ముందు ఎన్నికల వాతావరణం లాంటిది కొన్ని చోట్ల అయినా కనిపించే అవకాశం వుంది.