'పిల్లాడు' బొక్క బోర్లా పడ్డాడు.!

'యువరాజు' అయినాసరే, ఇంకా కాంగ్రెస్‌ పార్టీలో అందరూ ఆయన్ని 'పిల్లాడు' అనే పిలుస్తారు. వయసు తక్కువేమీ కాదు కానీ రాజకీయాల్లోనే 'అనుభవం' ఇంకా రావడంలేదాయనకి. నానమ్మ ఇందిరాగాంధీ, నాన్న రాజీవ్‌గాంధీ.. దేశ రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ, రాహుల్‌గాంధీ ఇంకా 'చిన్నపిల్లాడే'.! 

ప్రత్యేక హోదా పేరుతో రాహుల్‌గాంధీ, ఆంధ్రప్రదేశ్‌లో చాలాకాలం తర్వాత అడుగుపెట్టారు. వచ్చారు సరే, వచ్చి ఏం చెప్పారు.? ఏదో చెప్పారుగానీ అర్థం అయినట్టూ, అవనట్టూ గందరగోళాన్ని వదిలిపెట్టి వెళ్ళారు. అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్‌గాంధీకి ఎక్కడిది.? అన్న ప్రశ్న ముందుగా ఉత్పన్నమవుతుంది.

'మేం తప్పు చేశాం, శిక్ష అనుభవిస్తున్నాం..' అని కొందరు కాంగ్రెస్‌ నేతలు చెబుతుంటారు గనుక, 'పాత తప్పు'ని పక్కన పెడితే, గడచిన మూడేళ్ళలో ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్‌ ఏం చేసింది.? అన్న ప్రశ్న రావడం సహజమే కదా.! 

ప్రత్యేక హోదా ఇవ్వకపోతే, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వబోమని వైఎస్‌ జగన్‌, చంద్రబాబు కేంద్రానికి అల్టిమేటం జారీ చెయ్యాలని రాహుల్‌గాంధీ సెలవిచ్చారు. అసలంటూ, జీఎస్టీ సహా పలు కీలక చట్టాల విషయంలోనే కాంగ్రెస్‌ పార్టీ 'మెలిక' పెట్టి వుంటే, ప్రత్యేక హోదా వచ్చి వుండేదే. లోక్‌సభలో రాహుల్‌, ఎందుకు ఆయా విషయాల్లో నరేంద్రమోడీ సర్కార్‌ని నిలదీయలేదట.? 

గతం గతః అని ఎప్పటికప్పుడు అనుకోవాలన్నది బహుశా రాహుల్‌ ఉవాచ ఏమో. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తున్నప్పుడు, ఆ రాష్ట్రం నుంచి తమకు సరైన ప్రాతినిథ్యమే లేని ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రత్యేక హోదా విషయమై కలిసొచ్చే రాజకీయ పార్టీల్ని కలుపుకుపోవాలి. కానీ, రాహుల్‌ 'చిన్నపిల్లాడి' తత్వం ఇక్కడా బయటపెట్టుకున్నారు. వైఎస్సార్సీపీని విమర్శిస్తే ప్రత్యేక హోదా వస్తుందా.? ఆ విషయం కూడా తెలియని రాహుల్‌, కాంగ్రెస్‌ పార్టీకి ఉపాధ్యక్షుడట. 

మొత్తమ్మీద, రాహుల్‌గాంధీ ప్రత్యేక హోదా పోరు పేరు చెప్పి బొక్క బోర్లా పడ్డారు. ఆయనకిది అలవాటే. కానీ, ఈ సారి రాహుల్‌ తనతోపాటు, వేదికపై నిలబెట్టిన పలు పార్టీలకు చెందిన జాతీయ నాయకుల్నీ నవ్వులపాల్జేశారు. అదే మరి, రాహుల్‌గాంధీ అంటే. అందుకే రాహుల్‌గాంధీని చిన్న'పిల్లోడు' అనేది.

Show comments