అవునా, ధోనీ త్యాగం చేసేశాడా.?

ఆట అన్నాక గెలుపోటములు సహజం. అదే సమయంలో, ఆటగాడన్నాక సక్సెస్‌, ఫెయిల్యూర్‌ కూడా అంతే. ఫిట్‌నెస్‌ ఎల్లకాలం ఒకేలా వుండదు. ఫామ్‌ కూడా అంతే. సచిన్‌ టెండూల్కర్‌ లాంటోడికే ఫిట్‌నెస్‌, ఫామ్‌ సమస్యలొచ్చాయి. మహేంద్రసింగ్‌ ధోనీ, ఇందుకు మినహాయింపు కాదు కదా.! 

అనూహ్యంగా కెప్టెన్‌ అయ్యాడు.. అనూహ్యంగా టెస్ట్‌ క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పాడు.. అంతే అనూహ్యంగా వన్డే, టీ20 కెప్టెన్సీలనుంచి తప్పుకున్నాడు. రేప్పొద్దున్న అంతే అనూహ్యంగా క్రికెట్‌కి గుడ్‌ బై చెప్పొచ్చు. క్రికెట్‌లో ఇదంతా సర్వసాధారణమే. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, టీమిండియాకి పోరాట పటిమ నేర్పిన నాయకుడు గంగూలీ అయితే, దాన్ని పీక్స్‌కి తీసుకెళ్ళింది మాత్రం మహేంద్రసింగ్‌ ధోనీనే. 

మైదానంలో భావోద్వేగాల్ని గంగూలీ అదుపు చేసుకోలేడు.. ధోనీ, లోలోపల ఎంత భావోద్వేగమున్నా పైకి కూల్‌గా కన్పిస్తాడు. అంతే తేడా, మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌. పైగా, ధోనీ వాస్తవ పరిస్థితుల్ని చాలా వేగంగా అర్థం చేసుకోగలడు. అందుకే, పేలవమైన ఫామ్‌ కొనసాగిస్తున్న టైమ్‌లో, ఇక జట్టులో కొనసాగడం కష్టమని భావించి టెస్ట్‌ క్రికెట్‌ నుంచి తప్పుకున్నాడు. టెస్ట్‌ కెప్టెన్సీ చేజారిపోయాక, వన్డే - టీ20 ఫార్మాట్లలో ఎక్కువ కాలం కెప్టెన్‌గా కొనసాగలేనని ధోనీకి తెలుసు. అందుకే, వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. ఇందులో ధోనీ త్యాగమేమీ కన్పించదు, ముందు జాగ్రత్త తప్ప. 

బీసీసీఐ రాజకీయాల గురించి అందరికన్నా ఎక్కువగా ధోనీకే అవగాహన వుంది. ఫామ్‌లో వున్నప్పుడు ఆకాశానికెత్తేయడం, ఫామ్‌ కోల్పోతే దబాల్న నేలకు పడేయడంలో బీసీసీఐ రూటే సెపరేటు. ఇక, క్రికెట్‌ అభిమానులైనా సరే అంతే. ప్రస్తుతం క్రికెట్‌లో కోహ్లీ మేనియా నడుస్తోంది. టెస్ట్‌ క్రికెట్‌లో కోహ్లీ సంచలన విజయాల నేపథ్యంలో, తన ఇమేజ్‌ మసకబారిందని ధోనీకి అర్థమయిపోయింది. దాంతో, కెప్టెన్సీకి రాజీనామా చేసేశాడు. దీన్ని 'త్యాగం'గా అభివర్ణిస్తున్నారు. 

Readmore!

నిజానికి, క్రికెట్‌లో వ్యక్తుల కోసం త్యాగాలుండవు.. దేశం కోసం కష్టపడి ఆడటమే వుంటుంది. పైగా, త్యాగాలు చేసేంతటి త్యాగధనుడు కాదు ధోనీ. ఎనీ డౌట్స్‌.?

Show comments