బాబూ..ఈ పాత పేపర్ క్లిప్పులనేం చేద్దాం?!

‘ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి రమ్మనది నేనే.. అనురాగ దేవత షూటింగ్ లో ఆయనకు ఆ విషయాన్ని చెప్పా..’’  అని ఆధారాలతో సహా చెబుతున్నా, ఆ వ్యాఖ్యానాలు టీడీపీ అధినేత గాలినే తీస్తున్నాయి. ఎప్పుడో జరిగిన ఆ పరిణామంలో బాబుగా క్రెడిట్ కోరుకుంటున్నారు. మరి దీని వల్ల ఆయనకు క్రెడిట్ రావడం సంగతి ఎలా ఉన్నా, సొంత వాళ్లు కూడా ఈ విషయాన్ని సమర్థించే పరిస్థితి లేదు. హార్డ కోర్ చంద్రబాబు భక్తులు కూడా బాబుగారు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో.. కోరి ప్రత్యర్థులకు అవకాశం ఎందుకు ఇస్తున్నారో.. అనేది అంతుబట్టక తలపట్టుకున్నారు!

నాయకుడు ఒక స్టేట్ మెంట్ ఇస్తే.. అభిమానులు దాన్ని సమర్థించుకోవాలి… అయితే ఇప్పుడు బాబు  ఎన్టీఆర్ విషయంలో ఇచ్చిన స్టేట్ మెంట్ విషయంలో బాబు వీరాభిమానులు కూడా మౌనంగానే ఉన్నారు! వారైనా ఇంతకు మించి ఏం చేస్తారు పాపం!

ఎంత అధికారం , అనుకూల పత్రికలు చేతిలో ఉంటే మాత్రం… ముప్పై ముప్పైఐదేళ్ల చరిత్రనంతా మార్చుకుంటూ రావడం కష్టం కదా! ఇది వరకూ సత్యా నాదెళ్ల విషయంలో.. సత్య తండ్రి విషయంలో బాబుగారు చేసిన వ్యాఖ్యానాల్లో లాజిక్ లాగి ఉతికేశాయి ప్రతిపక్షాలు. అయినప్పటికీ బాబు ఎక్కడా తగ్గడం లేదు. 

చరిత్రనంతా బాబుగారు అధికారంలో ఉన్నప్పుడే మార్చేసుకోవడం, ఆయనకు అనుకూలంగా రాసుకోవడం కుదరకపోవచ్చు. ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి ఆహ్వానించింది తనే అని బాబుగారు చెప్పడం పూర్తిగా అబద్ధం.. ఎన్టీఆర్ విషయంలో బాబుగారి అంచనాలు వేరే ఉండినాయి. అనేదానికి బోలెడన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ విషయంలో బాబుగారు చేసిన వ్యాఖ్యానాలే అందుకు నిదర్శనం!

అధిష్టానం ఆదేశిస్తే మామపై పోటీకే సై.. అని బాబుగారు నాడు చేసిన ప్రకటనలు అన్ని పత్రికల్లోనూ ప్రముఖంగా అచ్చు అయ్యాయి. ఎంతైనా ఎన్టీఆర్  అల్లుడు కదా.. ఆయనపై ఈయన సవాలు చేస్తే మీడియాకు అంతకు మించిన మేత ఏముంటుంది? అందుకు సంబందించి  పేపర్ క్లిస్ప్ ను హైలెట్ చేస్తూ.. బాబుగారి మాటల్లోని డొల్లతనాన్ని హైలెట్ చేస్తున్నారు అనేక మంది.

అయితే.. తను మామపై పోటీకి సై అని అనలేదని.. బాబు గారు ఇప్పుడు అంటున్నారట! మరి  ఆయనను ఉటంకిస్తూ మీడియానే అలా కుట్ర పూరితంగా రాసిందని అనుకుందాం. కానీ.. తెలుగుదేశం ఆవిర్భవించాకా జరిగిన తొలి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తరపున పోటీ చేయడం కూడా అబద్ధమా?  లేక బాబుగారు కాంగ్రెస్ తరపున పోటీ చేసి.. ఎన్టీఆర్ ను గెలిపించారా?

ఆ ఎన్నికల్లో బాబు కాంగ్రెస్ తరపున పోటీ చేసి చిత్తుగా ఓటమి పాలవ్వడం కూడా కల్పితమేనా! ఒకవేళ ఎన్నికల కమిషన్ దగ్గర అందుకు సంబంధించిన ఆధారాలు ఏమీ లేకపోతే.. “అవును.. అదంతా అబద్దమే, ఎన్టీఆర్ ఎదుర్కొన్న తొలి ఎన్నికల స్ట్రాటజిస్టు నేనే.., ఎన్టీఆర్ ను నేనే గెలిపించా.. అల్లుడిగా నా బాధ్యతను అలా పూర్తి చేశా..’’ అని ఈ తరానికి తన ఘనతను వివరించే ఘనుడు కాదా మరి?

Show comments