దాసరితో 'టీడీపీ' ముచ్చట్ల వెనుక.?

దర్శకరత్న దాసరి నారాయణరావు, కాస్సేపట్లో అమరావతిలో జరిగే 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొననున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన విజయవాడ చేరుకున్నారు ఈ రోజు మధ్యాహ్నమే. దాసరి రాకను తెలుసుకున్న టీడీపీ నేతలు కొందరు, ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి జంప్‌ చేసిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, దాసరితో భేటీ అయినవారిలో వున్నారు. 

ఈ భేటీ ఇప్పుడు అటు సినీ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యింది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, దాసరి నారాయణరావు అంటే చిరంజీవికన్నా బాలకృష్ణకి అత్యంత సన్నిహితుడు. అదే సమయంలో, టీడీపీ అంటే మాత్రం గిట్టదు. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో ఆయన పనిచేసినా, ప్రస్తుతానికి వైఎస్సార్సీపీతో కాస్త సన్నిహితంగా వుంటున్నారు. మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్‌ అయ్యేందుకు వైఎస్సార్సీపీనే దాసరి ఎంచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. 

ఇంతకీ, దాసరితో టీడీపీ నేతల భేటీ వెనుక మర్మం ఏమిటి.? 'ఖైదీ నెంబర్‌ 150' ఫంక్షన్‌లో దాసరి ఏం మాట్లాడనున్నారో ముందుగానే తెలుసుకునేందుకు చంద్రబాబు లేదా బాలకృష్ణ వీరిని పురమాయించారా.? లేదంటే, వ్యక్తిగతంగానే టీడీపీ నేతలు దాసరిని కలిసొచ్చారా.? ఈ వ్యవహారంపై ఇరు వర్గాలూ పెదవి విప్పకపోవడంతో ఇదో పెద్ద హాట్‌ టాపిక్‌ అయ్యింది.

Show comments