కోట్లాది కళ్ళు గమనిస్తున్నాయ్‌: శ్రద్ధా కపూర్‌

'ఇదివరకటి రోజుల్లో స్టార్‌డమ్‌ వేరు.. ఇప్పటి స్టార్‌డమ్‌ వేరు.. అప్పటికీ ఇప్పటికీ చాలా తేడాలున్నాయ్‌.. కొంచెం తీపి, కొంచెం చేదు.. ఇవన్నీ వున్నాయ్‌..' అంటోంది బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌. 

ఒకప్పుడు సినిమా స్టార్స్‌ అంటే ఆ కిక్కే వేరు. స్టార్‌డమ్‌ ఆషామాషీగా వచ్చేది కాదు.. వచ్చిన స్టార్‌డమ్‌ని నిలబెట్టుకోవడం కోసం అప్పటి నటీనటులు పడ్డ కష్టం వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఆడియన్స్‌తో ఇంటరాక్షన్‌ అప్పుడు తక్కువ. ఇప్పుడు చాలా ఎక్కువ. సోషల్‌ మీడియా స్టార్స్‌ని, ఆడియన్స్‌ వద్దకు తీసుకెళ్ళిపోతోంది. ఇదే విషయాన్ని శ్రద్ధా కపూర్‌ చెబుతూనే, ఆనాటి స్టార్స్‌ ఇలాంటివేమీ లేకుండా తమను తాము స్టార్స్‌గా తీర్చిదిద్దుకోవడం, ఇంకా తమను తాము మెరుగుపర్చుకోవడం ఎలా సాధ్యమయ్యిందో తనకి ఇప్పటికీ అర్థం కావడంలేదని ఆశ్చర్యపోతోంది. 

తనవరకూ తాను తన అభిమానులనుంచి వచ్చే ఫీడ్‌ బ్యాక్‌ని జాగ్రత్తగా పరిశీలిస్తాననీ, లుక్స్‌ దగ్గర్నుంచి, నటన వరకు ప్రతి విభాగంలోనూ అభిమానులు ఇచ్చే సూచనల్ని, సలహాల్నీ స్వీకరిస్తాననీ చెబుతోంది శ్రద్ధా కపూర్‌. ఒక్కోసారి, కొందరు పనిగట్టుకుని చెత్త కామెంట్స్‌ చేస్తుంటారనీ, అలాంటివారి నుంచి తప్పించుకోవడమూ కష్టమేనని శ్రద్ధా కపూర్‌ వాపోయింది. 

స్టార్స్‌ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా వారి మీద నిఘా ఎక్కువైపోతోంది గనుక, అప్రమత్తంగా వుండక తప్పడంలేదని శ్రద్ధా కపూర్‌ చెప్పుకొచ్చింది.

Show comments