వైఎస్సార్సీపీ జై ఆంధ్రప్రదేశ్‌ రాజకీయమేనా.!

పచ్చకామెర్లు వున్నోడికి లోకమంతా పచ్చగానే కన్పిస్తుందట. తెలుగుదేశం పార్టీకి కూడా అలాగే కన్పిస్తున్నట్టుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 'జై ఆంధ్రప్రదేశ్‌' పేరుతో ఆంధ్రప్రదేశ్‌ అంతటా బహిరంగ సభలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయం విదితమే. ఈ బహిరంగ సభల వెనుక రాజకీయం వుందన్నది టీడీపీ ఆరోపణ. టీడీపీ ఆరోపణ అయితే, దాన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీ అనుకూల మీడియా కూడా అదే మాట అంటోంది. అలాగే విశ్లేషించేస్తోంది. 

ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయమే చేస్తుంది. అడుగు తీసి అడుగేస్తే అందులో రాజకీయ ప్రయోజనం గురించే రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి. ప్రత్యేక హోదా కోసం గతంలో బీజేపీ పార్లమెంటు వేదికగా ఎందుకు నినదించింది.? రాజకీయ దురుద్దేశ్యంతోనే కదా.! బీజేపీతో, టీడీపీ పొత్తు పెట్టుకున్నదెందుకు.? రాజకీయ అవసరాల కోసమే కదా. ప్రత్యేక హోదాని బీజేపీ - టీడీపీ కలిసి అటకెక్కించింది ఎందుకు.? రాజకీయ కుట్రలతోనే కదా.! 

మరి, వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా కోసం నినదిస్తూ, 'జై ఆంధ్రప్రదేశ్‌' పేరుతో బహిరంగ సభలు నిర్వహిస్తున్నప్పుడు, ఆ పార్టీ ఎందుకు అందులోంచి ఎంతో కొంత రాజకీయ ప్రయోజనాన్ని ఆశించకూడదు.? అయినా, వైఎస్సార్సీపీ 'జై ఆంధ్రప్రదేశ్‌' అంటోందిగానీ, టీడీపీ - బీజేపీల్లా 'నై ఆంధ్రప్రదేశ్‌' అనలేదు కదా.! మరెందుకు టీడీపీ, బీజేపీ బెంబేలెత్తిపోతున్నాయట.? 

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశం అత్యంత కీలకం కానుంది. ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ప్యాకేజీ కాదు.. వాటి స్థానంలో ప్రత్యేక సాయం.. అంటూ కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌ సన్నాయి నొక్కులు నొక్కుతోంటే, తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు సర్కార్‌ కూడా కేంద్రంతో రాజీ పడిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌.  Readmore!

ప్రత్యేక హోదా సంగతి పక్కన పెడదాం. రైల్వే జోన్‌ ఏమయ్యింది.? రాజధాని నిర్మాణంలో కేంద్రం అందించాల్సిన సాయం ఏమయ్యింది.? అసలు ప్రత్యేక సాయానికి చట్టబద్ధత ఏది.? ముఖ్యమంత్రి తన స్థాయిని మర్చిపోయి, కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీని అమరావతి సాక్షిగా 'మాకు చట్టబద్ధత కావాలి మొర్రో..' అని వేడుకుంటే, 'పరిశీలిస్తాం, త్వరలోనే చట్టబద్ధత కల్పిస్తాం..' అనే హామీని కూడా ఆయన ఇవ్వలేకపోయారు. 

ఈ పరిస్తితుల్లో ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 'జై ఆంధ్రప్రదేశ్‌' పేరుతో బహిరంగ సభలు నిర్వహించడం అనేది ప్రతిపక్షానికి అత్యంత వ్యూహాత్మకం. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. 2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా అత్యంత కీలక నినాదం కానున్న దరిమిలా, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల్ని సన్నద్ధం చేసేందుకు ప్రతిపక్షంగా తన బాధ్యత తాను నిర్వహించడమే తప్పంటే ఎలా.? 

అయినా, ఇటు చంద్రబాబు, అటు నరేంద్రమోడీ నిర్వహించిన సర్వేల్లో రాష్ట్ర ప్రజలెవరూ ప్రత్యేక హోదా కోరుకోవడంలేదని తేలడమే నిజమయినప్పుడు, వైఎస్‌ జగన్‌ 'జై ఆంధ్రప్రదేశ్‌' పేరుతో ఎంతలా గొంతు చించుకున్నా.. టీడీపీ భయపడాల్సిన పనేలేదు.. బీజేపీ బెంబెలెత్తాల్సిన అవసరం లేదు. కానీ, కంగారు పడ్తున్నాయంటే, వైఎస్‌ జగన్‌ ఆ రెండు పార్టీల వెన్నులో వణుక పుట్టించినట్లే 'జై ఆంధ్రప్రదేశ్‌' నినాదంతో. ఎనీ డౌట్స్‌.?

Show comments