రవితేజకి అంత వీజీ కాదండోయ్‌.!

డ్రగ్స్‌ కేసులో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఎక్సయిజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ 'సిట్‌' యెదుట విచారణకు హాజరయ్యారు. తాజాగా నేడు, 'ఐటమ్‌ బాంబ్‌' ముమైత్‌ఖాన్‌ విచారణ జరుగుతోంది. సినీ సెలబ్రిటీల విచారణ ఓ వైపు కొనసాగుతుండగానే, ఇంకో వైపు ఈ 'డ్రగ్స్‌ మాఫియా'కి సంబంధించి పలువురు కీలక వ్యక్తులు అరెస్ట్‌ అవుతుండడం గమనార్హం. అయితే, ఈ అరెస్టులు సినీ ప్రముఖులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే జరుగుతున్నాయా.? అన్న విషయమై స్పష్టత లేదు. 

ఇక, ఇప్పటిదాకా 'సిట్‌' యెదుట విచారణకు హాజరైన సినీ సెలబ్రిటీలు వేరు, త్వరలో 'సిట్‌' యెదుట విచారణకు హాజరు కానున్న రవితేజ సంగతి వేరు. మాస్‌ మహరాజ్‌ అనీ, ఆన్‌ స్క్రీన్‌ ఎనర్జీకి మారు పేరనీ రవితేజ గురించి సినీ పరిశ్రమలో విన్పించే మాటల గురించి కొత్తగా చెప్పేదేముంది.? అయితే, సినీ నటుడిగా రవితేజ ఎంత మంచి పేరు తెచ్చుకున్నా, ఆయన సోదరుల కారణంగా రవితేజ ఇమేజ్‌కి ఎప్పటికప్పుడు డ్యామేజీ జరుగుతూనే వుంది. 

రవితేజ సోదరులు భరత్‌, రఘు.. ఇద్దరూ గతంలో డ్రగ్స్‌ కేసులో ఇరుక్కున్నారు. ఇటీవలే రవితేజ సోదరుడు భరత్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విదితమే. ఆ తర్వాతే టాలీవుడ్‌లో సినీ ప్రముఖులకి డ్రగ్స్‌తో లింక్స్‌ వ్యవహారం కొత్తగా వెలుగు చూసింది. భరత్‌ మరణానికీ ఈ డ్రగ్స్‌ లింక్‌ తెరపై రావడానికీ సంబంధం లేదన్న వాదనలూ విన్పిస్తున్నా.. అనుమానాలు మాత్రం అలాగే వున్నాయి. ఈ నేపథ్యంలో 'సిట్‌' యెదుట రవితేజ విచారణకు హాజరు కానుండడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

తన కుమారుడికి డ్రగ్స్‌తో సంబంధం లేదని ఇప్పటికే రవితేజ తల్లి మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. భరత్‌ కూడా చనిపోవడానికి కొద్ది రోజుల ముందునుంచీ డ్రగ్స్‌కి దూరంగా వుంటున్నాడనీ, అతను మారాక దురదృష్టవశాత్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని వాపోయారామె. అన్నట్టు, సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించినా, చివరి చూపుకి రవితేజ నోచుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. భరత్‌ క్యారెక్టర్‌ మీద అసహనంతోనే రవితేజ అలా చేశాడన్నది ఆ విమర్శల సారాంశం. వాటిని రవితేజ ఖండించాడనుకోండి.. అది వేరే విషయం. 

మొత్తమ్మీద, రవితేజ విచారణ సందర్భంగా ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొనే అవకాశమైతే సుస్పష్టం. సోదరుల విషయంలో జరిగిందేంటో రవితేజకి తెలుసు. వాటిపై పెదవి విప్పాల్సి వస్తే రవితేజకి అది కష్ట సమయమే అవుతుంది. తన గురించి ఎలా డిఫెండ్‌ చేసుకుంటాడో, సోదరులకు డ్రగ్స్‌తో వున్న లింకులపై ఎలా పెదవి విప్పుతాడోగానీ.. రవితేజ సిట్‌ యెదుట విచారణకు హాజరు కానుండడంపై అటు సినీ వర్గాల్లోనూ, ఇటు సాధారణ ప్రజానీకంలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Show comments