ఆ నలుగురు చాలు 'పనైపోద్ది'

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోరుతూ ఈ నెల 26వ తేదీన విశాఖపట్నంలో యువత భారీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం విదితమే. అనూహ్యంగా ఈసారి యువత సినీ పరిశ్రమ నుంచి మద్దతును కోరుతోంది. తమిళనాడులో జల్లికట్టు పోరాటానికి అక్కడి సినీ పరిశ్రమ మద్దతిచ్చిన దరిమిలా, ఆంధ్రప్రదేశ్‌ యువత తెలుగు సినీ పరిశ్రమ మద్దతును కోరడం సబబే కదా.! 

మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమ దిగి వచ్చేయనక్కర్లేదు. ఆ నలుగురు దిగొస్తే సరిపోతుంది. ఆ నలుగురిలో ఒక్కొక్కరిదీ ఒక్కో పార్టీ. ఆ నలుగురూ ఆయా రాజకీయ పార్టీల్లో మోస్ట్‌ పాపులర్‌ లీడర్స్‌. అందులో మొదటి వ్యక్తి మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి. కాంగ్రెస్‌ పార్టీలోనే వున్నా, గత కొన్నాళ్ళుగా రాజకీయాలకు సంబంధించి అంత యాక్టివ్‌గా లేరాయన. అయితే, చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ ప్రజల రుణం తీర్చుకోవడానికి ఇంతకు మించిన సందర్భం ఇంకోటి రాదు. ఆ విషయం చిరంజీవి తెలుసుకోవాల్సి వుంది.

చిరంజీవి తర్వాత అంతటి ప్రజాదరణ వున్న వ్యక్తి బాలకృష్ణ. టీడీపీలో అత్యంత కీలకమైన నేత ఈయన. ఎమ్మెల్యే కూడా. ‘గౌతమి పుత్ర శాతకర్ణి‘ సినిమాతో తెలుగు జాతి ఆత్మగౌరవ.. అని నినదించారాయన. ఇప్పుడు ఆంధ్రపదేశ్ ఆత్మగౌరవం కోసం నిజ జీవితంలో ఆయన నినదించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక, వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా సంగతి ప్రత్యేకంగా చెప్పేదేముంది.? రాజకీయాల్లో ఆమె వాక్చాతుర్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరోపక్క, ప్రత్యేక హోదా ఉద్యమంలో ఈసారి సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది పవన్‌కళ్యాణ్‌. 

ప్రస్తుతానికైతే పవన్‌కళ్యాణ్‌, రోజా తప్ప ప్రత్యేక హోదా ఉద్యమంలో అటు చిరంజీవిగానీ, ఇటు బాలకృష్ణగానీ అంతగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం. సోషల్‌ మీడియా వేదికగా చిరంజీవి అభిమానులూ, బాలకృష్ణ అభిమానులూ తమ అభిమాన హీరోలు, తమ కోసం.. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని నినదిస్తున్నారు. విశాఖలో జరిగే శాంతియుత నిరసనలో పాల్గొనాలని కోరుతున్నారు. 

'పనైపోద్ది.. పనైపోద్ది.. పనైపోద్ది రారా..' అనే పాటతో అభిమానులు తమ అభిమాన నటీనటులకు సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. కాస్సేపట్లో పవన్‌కళ్యాణ్‌, 'దేశ్‌బచావో' పేరుతో ఓ మ్యూజిక్‌ ఆల్బమ్‌ని జనసేన పార్టీ తరఫున విడుదల చేయనున్నారు. ఇదీ ప్రత్యేక హోదా ఉద్యమానికి ఊపునిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జెండాల్ని పక్కన పెట్టి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరూ ఏకమవ్వాల్సిన ఈ తరుణంలో.. అందరూ కాదు, కనీసం 'ఆ నలుగురు' అయినా ఒక్కతాటిపైకి వస్తారా.? వస్తే మాత్రం, 'పనైపోద్ది'. అవును, నిజమే పనైపోద్ది.!

Show comments