ఆమెపై అత్యాచారమా.? నాన్సెన్స్‌.!

హీరోయిన్‌ భావనను కిడ్నాప్‌ చేసిన దుండగులు, ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై భావన ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడం, మొత్తం ఏడుగురు నిందితుల్ని పోలీసులు అదపులోకి తీసుకోవడం జరిగింది. షూటింగ్‌ ముగించుకుని, తిరిగి వెళుతున్న సమయంలో దాదాపు 25 కిలోమీటర్ల మేర కారులో ప్రయాణిస్తున్న తనపై ఆ ఏడుగురు వేధింపలుకు పాల్పడ్డారనీ, ఈ క్రమంలో వారు తన ఫొటోల్ని, వీడియోల్ని చిత్రీకరించారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో భావన పేర్కొన్న విషయం విదితమే. 

కాగా, భావనపై అత్యాచారం జరిగిందంటూ దుష్ప్రచారం జరగడాన్ని మలయాళ సినీ పరిశ్రమ తీవ్రంగా ఖండిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో 'అత్యాచారం' అన్న ప్రస్తావన ముందుగా ఎందుకు తెరపైకి వస్తుందో తమకు అర్థం కావడంలేదనీ, దుండగులు భావనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనీ, ఈ ఘటనకు సంబంధించి ఎవరూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అసత్య కథనాల్ని ప్రచారం చేయరాదని మలయాళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కోరుతున్నారు. విచారణలో అన్ని విషయాలూ వెలుగు చూస్తాయని వారంటున్నారు. మరోపక్క, భావనకి పెళ్ళి కూడా ఫిక్సయ్యిందని, ఈ ఘటనతో అదేమీ డిస్టర్బ్ కాదని ఆమెతో సినిమా తీస్తున్న దర్శకుడొకరు చెప్పారు. ప్రతిఒక్కరూ ఇప్పుడామెకు మానసిక స్థయిర్యాన్ని ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. 

తమిళ హీరో విశాల్‌, భావనని కిడ్నాప్‌ చేసి ఆమెను లైంగికంగా వేధించినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు. మొత్తం తమిళ సినీ పరిశ్రమ ఆమెకు అండగా వుంటుందని ప్రకటించాడు. మరోపక్క, భావన ఫిర్యాదు నేపథ్యంలో దుండుగుల నుంచి మొబైల్‌ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఆరోపిస్తున్నట్లుగా ఫొటోలు, వీడియోలు ఏమైనా తీశారా.? తీస్తే, వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారా.? అనే విషయమై ఆరా తీస్తున్నారు పోలీసులు. 

ఇదిలా వుంటే, భావనకి మద్దతుగా బాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖులు కూడా గళం విప్పుతుండడం గమనార్హం. తెలుగులో 'మహాత్మ', 'ఒంటరి', 'హీరో' తదితర సినిమాల్లో భావన నటించింది. Readmore!

Show comments

Related Stories :