ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలలో పోటీ చేసే విషయంలో మిత్రుల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. రేపో మాపో నోటిఫికేషన్ జారీ అవుతున్న నేపధ్యంలో కూడా అభ్యర్ధి ఎవరన్నది తేలకపోవడంతో రెండు పార్టీల శిబిరాలూ ఆందోళన పడుతున్నాయి. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎలాగైనా పోటీ చేసి తీరాలన్నది బీజేపీ పంతంగా కనిపిస్తోంది. దీనికి కారణం లేకపోలేదు. ఆ పార్టీ అభ్యర్ధులు చాలా ముందుగానే పట్టభద్రుల ఓట్లను గుత్తమొత్తంగా చేర్పించడంతో పాటు, గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో చాలావరకూ పట్టు సాధించారు. పోటీ చేసేందుకు కమలదళంలో పలువురు ఆసక్తిగా కూడా ఉన్నారు.
బీజేపీ అధికార ప్రతినిధిగా చురుకైన పాత్ర పోషిస్తున్న చెరువు రామకోటయ్య 2011 ఎన్నికలలో బీజేపీ తరఫున పోటీ పడి గౌరవ ప్రదమైన ఓట్లను దక్కించుకున్నారు. ఇపుడు టీడీపీని, కేంద్రంలో అధికారాన్ని దన్నుగా చేసుకుని విజయ తీరాలకు చేరుకోవాలని ఆశ పడుతున్నారు. ఆయనతో పాటు, బీజేపీ మాజీ నగర అధ్యక్షులు, న్యాయవాదులైన జె పృధ్వీరాజ్, పివి నారాయణరావు వంటి వారు రేసులో ఉన్నారు. ఇక, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే మొదట పేరు చెప్పుకునే సీనియర్ మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ వృద్ధ నాయకుడు పీవీ చలపతిరావు రాజకీయ వారసుడు, బీజేపీలో కీలకమైన నాయకుడు పీవీఎస్ మాధవ్ కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. 2014 ఎన్నికలలో ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం టిక్కెట్ ఆశించగా, ఎమ్మెల్సీ సీటు హామీతోనే వెనక్కి తగ్గారన్న మాట వినిపిస్తోంది.
ఈ నేపధ్యంలో ఎట్టి పరిస్థితులలోనూ ఎమ్మెల్సీ టిక్కెట్‌ను వదులుకోరాదన్న పట్టుదలతో బీజేపీ ఉంది. ఇదిలా ఉండగా, టీడీపీలో సైతం ఎమ్మెల్సీ టిక్కెట్ కోసం చాలా హడావుడి కనిపిస్తోంది. మాజీ మంత్రి దివంగత ఆళ్వార్‌దాస్ కుమారుడు, విశాఖ నగరంలోని ప్రముఖ విద్యా సంస్ధల అధిపతి సుంకర రవీంద్ర టీడీపీ టిక్కెట్ కోసం చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఆయన సైతం పెద్ద సంఖ్యలో పట్టభద్రుల ఓటర్లను చేర్పించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖకు వచ్చినపుడు మర్యాదపూర్వకంగా కలసి తన అభ్యర్ధనను విన్నవించుకున్నారు. అదే విధంగా, మంత్రి గంటా శ్రీనివాసరావుతో తనకు ఉన్న పరిచయాన్ని కూడా వినియోగించుకుని టిక్కెట్ సాధించాలని చూస్తున్నారు. ఇంకోవైపు మంత్రి గంటా డబుల్ గేమ్ అడుతున్నారు. సుంకర రవీంద్రకు మద్దతు ఇస్తూనే ప్రజారాజ్యం నుంచి తన ముఖ్య అనుచరునిగా ఉన్న కాశీ విశ్వనాధాన్ని తెరపైకి తెస్తున్నారు.
రియల్టర్‌గా మాత్రమే జనానికి పరిచయం ఉన్న కాశీని టీడీపీ నాయకునిగా ఎవరూ ఆంగీకరిరచకపోయినా మంత్రి గారు మాత్రం ఆయనకే టిక్కెట్ ఇప్పించాలని పట్టుపడుతున్నారు. ఇంకో వైపు సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుని ప్రోత్సాహంతో మరికొందరు తమ్ముళ్లు ఎమ్మెల్సీపై ఆశలు పెంచుకున్నారు. ఈ నేపధ్యంలోనే రెండు పార్టీల మధ్య టిక్కెట్ కోసం ప్రతిష్టంబన ఏర్పడింది. ఇప్పటికి పలు దఫాలుగా విశాఖ వచ్చిన చంద్రబాబు ఎమ్మెల్సీ విషయంలో ఎంతకూ తేల్చకపోవడంతో మిత్ర శిబిరాలలో ఆందోళన తారస్ధాయికి చేరిపోయింది. నోటిఫికేషన్ వచ్చేశాక ఎన్నికలకు, ప్రచారానికి అట్టే వ్యవధి ఉండదని, ఈలోగా అభ్యర్ధి ఎవరో తెలిస్తే బరిలోకి దూకి ప్రచారం ఆరంభిస్తామంటూ అటు టీడీపీ, ఇటు బీజేపీ నాయకులు అంటున్నారు.
కాగా, వామపక్షాలు బలపరచిన ప్రగతిశీల కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్ధి అజ శర్మ మాత్రం గత మూడు నెలలుగా అలుపెరగని పోరాటం చేస్తూ దూసుకుపోతున్నారు. గతంలో రెండు విడతలు వామపక్షాల అభ్యర్ధి విజయం సాధించడంతో ఈసారి కూడా గెలుపుపై ఆ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఇంకో వైపు ఓ మాజీ మంత్రి మద్దతుతో ఎమ్మెల్సీ పోరులో ఇండిపెండెంట్‌గా ఓ సాయంకాలం దినపత్రిక అధిపతి స్వతంత్రునిగా బరిలోకి దిగారు. అలాగే, మరికొందరు విద్యావంతులు కూడా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. లక్షా యాబై వేల వరకూ పట్టభద్రుల ఓటర్లు నమోదు అయిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ నియోజకవర్గంలో అధికార పార్టీల ఎత్తుగడలేమిటో తెలిస్తే తప్ప పోరు రసకందాయంలో పడదు.