తమిళనాడులో రాజకీయ అలజడి దాదాపు ఖాయం అయినట్టే.. జయ కోలుకుంటోంది. ఆమె చికిత్సకు స్పందిస్తున్నారు.. అంటూ వైద్యులు ప్రకటనలు చేస్తున్నా, తాజాగా జయ ఆధ్వర్యంలోని శాఖల బాధ్యతలన్నింటినీ ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత జయ క్యాబినెట్ లోని మంత్రి పన్నీరు సెల్వంకు అప్పగించడంతో.. ఈ మేరకు గవర్నర్ నుంచి అధికారిక ప్రకటన రావడంతో.. జయ పరిస్థితి ఏమిటో అర్థమైపోతోంది.
జయ దాదాపు అపస్మారక స్థితిలోనే ఉన్నారని క్లారిటీ వస్తోంది. ఈ విషయంపై స్పష్టతతో అన్నాడీఎంకే శ్రేణుల మధ్య జయలలిత పీఠం కోసం పోటీ ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి అయితే జయ చేతిలోని శాఖలన్నింటినీ పన్నీరు సెల్వం సంపాందించుకున్నాడు. అయితే ‘ముఖ్యమంత్రి’ ట్యాగ్ మాత్రం దక్కడం లేదు.
జయ జైలుకు వెళ్లినప్పుడో, ఆమె ముఖ్యమంత్రి పదవికి అనర్హురాలు అయినప్పుడో ఆమెకు డమ్మీగా సీఎం పీఠంలో కూర్చోవడం వేరు, ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు సీఎం పీఠంలో కూర్చోవడం వేరని సెల్వానికి తెలియనది ఏమీ కాదు. ఇప్పుడు కూర్చుంటే పాతుకుపోవడమే! జయ జైలు పాలైనప్పుడు సీఎం పీఠాన్ని ఎక్కినప్పుడే భారీ ఎత్తున పార్టీలు చేసుకున్న వ్యక్తి ఈయన. అలాంటిది ఇప్పుడు ఈయనకు సీఎం పదవి దక్కితే.. తర్వాతి కథ వేరే రకంగా ఉంటుంది.
జయలలిత నెచ్చెలి శశికళ కూడా అప్పుడే తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఆమె కూడా ఈ అదును లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నాలను తీవ్రం చేసింది. పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మరణంతో ఖాళీ అయిన స్థానం నుంచి తను పోటీ చేయాలని శశికళ భావిస్తోంది. ఆ విధంగా ఎమ్మెల్యే హోదాను సంపాదించుకుంటే.. సీఎం పీఠాన్ని సొంతం చేసుకోవచ్చనేది ఆమె ప్రణాళిక అని స్పష్టం అవుతోంది.
అలాంటి ప్రణాళికే లేకపోతే.. ఇప్పటికిప్పుడు ఆమె ప్రత్యక్ష రాజకీయాల వైపు ఎందుకు ఆసక్తి చూపుతుంది? ఇక పార్టీలోనే పన్నీరు సెల్వం అదృష్టాన్ని నిరసించే వర్గం ఒకటి ఉంది. పన్నీరుకు ఈ సారి ముఖ్యమంత్రి హోదా దక్కితే ఆ వర్గం ఏ మాత్రం సహించే పరిస్థితి లేదు. ఆయనపై తిరుగుబాటు తప్పకపోవచ్చు.
ఇక ప్రతిపక్ష పార్టీ డీఎంకే కూడా తక్కువ స్థాయిలో ఏమీ లేదు. మొన్నే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృటిలో విజయాన్ని కోల్పోయామనే భావనతో ఉంది ఆ పార్టీ. జయ ఇలాగే ఆసుపత్రిలో ఉండి.. అన్నాడీఎంకేలో లుకలుకలు ప్రారంభం అయితే.. కరుణానిధి, స్టాలిన్లు ఉరికే ఏమీ ఉండరు. మధ్యంతర ఎన్నికలు తీసుకురావడానికి వారు శతథా ప్రయత్నించే అవకాశాలున్నాయి.
మొత్తానికి అమ్మ ఆసుపత్రి పాలైన నేపథ్యంలో.. తమిళనాట రాజకీయం రాసకందాయకంలో పడుతోంది. ఎమ్జీఆర్ అంత్యదశలో జరిగిన హైడ్రామానే మళ్లీ రిపీటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.