పన్నీరు.. తక్కువోడు కాదు గురూ.!

అమాయకుడు.. మౌనముని.. భక్తుడు.. వీర విధేయుడు.. ఇవే కాదు, వ్యూహాలు రచించడంలోనూ, వాటిని అమలు చేయడంలోనూ దిట్ట.. పన్నీర్‌ సెల్వం గురించి తాజాగా విన్పిస్తున్న మాట ఇది. జయలలిత మరణానంతరం పన్నీర్‌ సెల్వం రాజకీయంగా రాటుదేలాడనే విషయం, తాజాగా ఆయన అనుసరిస్తున్న వ్యూహాల్ని బట్టి అర్థమవుతోంది. 

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత, పన్నీర్‌ సెల్వంలోని అసలైన వ్యూహకర్త బయటకొచ్చాడు. మౌనంగా, జయలలిత సమాధి వద్ద కాసేపు విలపించిన పన్నీర్‌ సెల్వం, ఆ తర్వాత మీడియా ముందుకొచ్చి.. 'అమ్మ అత్మఘోష..' అంటూ సెంటిమెంట్‌ కార్డు ప్లే చేయడం, ఆ తర్వాత తమిళ రాజకీయాలు హీటెక్కడం తెల్సిన విషయాలే. ఒక్కడే, ఏం చేయగలడు.? అని శశికళ వర్గం అనుకుందిగానీ, ఆ ఒక్కడే ఇప్పుడు ప్రభంజనంలా మారిపోతుండడం గమనార్హం. 

'మా ఎమ్మెల్యేలను పన్నీర్‌ సెల్వం కొనుగోలు చేస్తున్నారు..' అంటూ శశికళ గొంతు చించుకుంటున్నారిప్పుడు. మొత్తం 131 మంది ఎమ్మెల్యేల తన వెంట వున్నారని నిన్ననే శశికళ ప్రకటించుకున్నారు. వాళ్ళందర్నీ దాచేసిన చిన్నమ్మ శశికళ, అందులోంచి కొందరు జారిపోయిన వైనాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ రోజు ఉదయానికి పన్నీర్‌ సెల్వం శిబిరంలో అధికారికంగా ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరుకుంది. అనధికారికంగా 40 మందికి పైగానే ఎమ్మెల్యేలు పన్నీర్‌ సెల్వం వెంట వున్నట్లు తెలుస్తోంది. 

ఈ మొత్తం ఎపిసోడ్‌లో, అసలు శశికళ దాచిన ఎమ్మెల్యేల సంఖ్య ఎంత.? అన్నదానిపై స్పష్టత లేదు. అలా దాచిన ఎమ్మెల్యేలను తన వద్దకు రప్పించుకునేందుకు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాల్ని పన్నీర్‌ సెల్వం వినియోగించుకుంటుండడం గమనార్హం. చెన్నయ్‌ పోలీస్‌ కమిషనర్‌ని మార్చేయడం, మిస్‌ అయిన ఎమ్మెల్యేలను కనుగొనాలంటూ డీజీపీని ఆదేశించడం, శశికళ ప్రస్తుతం నివసిస్తున్న ఒకప్పటి జయలలిత నివాసం పోయెస్‌ గార్డెన్‌ని ప్రభుత్వ వశం చేసేందుకు సమాయత్తమవడం.. ఇలా దెబ్బ మీద దెబ్బ కొడుతుండడంతో శశికళ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.  Readmore!

కాస్సేపట్లో గవర్నర్‌ విద్యాసాగర్‌రావు చెన్నయ్‌కి వస్తుండడంతో, ప్రోటోకాల్‌ ప్రకారం ముందుగా ఆయన్ని కలిసే అవకాశం కూడా పన్నీర్‌సెల్వంకే వుంటుంది. ఇంకోపక్క, గవర్నర్‌ని కలిసేందుకు శశికళకు అవకాశం ఎంత.? అన్నదానిపై అనుమానాలు కొనసాగుతున్నాయి. 

మొత్తమ్మీద, పన్నీర్‌ సెల్వం చక్రం తిప్పారు.. అలా ఇలా కాదు.. ఎవరి ఊహలకూ అందని రీతిలో చిన్నమ్మ శశికళకు దిమ్మ తిరిగేలా ఒకదాని తర్వాత ఇంకోటి.. షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే వున్నారన్నమాట.

Show comments

Related Stories :