అలాంటి పార్టీల్లో ‘జనసేన’ ఒకటనుకోవచ్చుగా!

పవన్ కల్యాణ్ స్థాపించిన ‘జనసేన’ విషయంలో ఏపీ బీసీ సంఘం నుంచి ఒక ఆసక్తికరమైన డిమాండ్ వచ్చింది. ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని దాని అధ్యక్షుడు డేరంగుల ఉదయ్ కిరణ్ డిమాండ్ చేశాడు. ప్రజాసమస్యల గురించి స్పందించడం లేదు కాబట్టి.. ఆ పార్టీని రద్దు చేయాలని ఆయన ఈసీని కోరాడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ పై కూడా ఆ సంఘం తీవ్రమైన వ్యాఖ్యలను చేసింది.

కట్టుకున్న భార్యకు, కన్నబిడ్డలకు న్యాయం చేయలేని పవన్ కల్యాణ్ ప్రజలకు ఏం చేయగలడు? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందేమో.. బీజేపీ, తెలుగుదేశం పార్టీల తరపున ప్రచారం చేస్తూ అవసరం అయితే ఆ పార్టీల నుకూడా ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? అంటూ  ఉదయ్ కిరణ్ ప్రశ్నించాడు.
మరి ప్రజాసమస్యలపై స్పందించలేదని ఒక రాజకీయ పార్టీ గుర్తింపును రద్దు చేయడం కుదరకపోవచ్చు. 

ఎన్నికల సంఘం వద్ద ఎన్నో పార్టీలు రిజిస్టర్ అయి ఉంటాయి. వీటి సంఖ్య వందల్లో.. వేలల్లో ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలా రిజిస్టర్ అయిన పార్టీల ఉనికి గురించి ఆ తర్వాత ఈసీ పట్టించుకోకపోవచ్చు. ఆ పార్టీ అధ్యక్షులు ప్రజాసమస్యల మీద పోరాడుతున్నారా? లేదా? అనే అంశాలు కూడా ఈసీకి సంబంధం లేనివే. ఎన్నికల హామీల విషయంలో  కూడా ఇప్పటి వరకూ ఈసీ ఏం చేయలేకపోతోంది. ఆఖరికి తాము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచామని స్పీకర్ స్థాయి వాళ్లే ఒప్పేసుకున్నా.. ఇప్పటి వరకూ ఈసీ ఏం చర్యలూ తీసుకోలేకపోయింది. తీసుకుంటుందనే ఆశ కూడా ఎవరికి లేదు. 

అలాంటి వ్యవస్థ అయిన ఈసీని ఒక పార్టీ గుర్తింపును రద్దు చేయమని కోరితే దానికి సమాధానం ఏం వస్తుంది? ప్రస్తుతానికి అయితే జనసేనను ఎన్నో అనామక పార్టీల్లో ఒకటనుకోవాలి. దీని పేరును పవన్ కల్యాన్ బ్లాక్ చేసి పెట్టుకున్నాడని అనుకోవాలి.   

Show comments