వీళ్ల రాజకీయం కోసం.. రాజ్యాంగాన్ని మారుస్తారా!

ఇప్పటికిప్పుడు ప్రజలకు మరే బాధ లేదు… వారి బాధల్లా కేవలం నియోజకవర్గాల పెంపు సమస్య గురించి మాత్రమే అన్నట్టుగా ఉంది టీఆర్ఎస్ నేతల తీరు. ఇప్పట్లో నియోజకవర్గాల పునర్వభజన ఉండదు.. అదంతా 2026 లో జరిగే పని మాత్రమే అని కేంద్ర హోం శాఖ తాజాగా మరోసారి స్పష్టం చేసిన నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. రాజ్యాంగ సవరణ చేసి, నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి, తమ రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలి.. అని డిమాండ్ చేస్తున్నాడు!

తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలోని  ఈ టీఆర్ఎస్ నేతలకు, ఏపీలోని టీడీపీ నేతలకు ఈ నియోజకవర్గాల పెంపు పెద్ద టెన్షన్ అయిపోయింది. ఈ పెంపు లేకపోతే రేపటి ఎన్నికల్లో తామేం అయిపోతామో.. అనే భయం పట్టుకుంది. విచ్చల విడిగా ఫిరాయింపులను ప్రోత్సహించేసిన నేపథ్యంలో వీళ్లు ఎటు తిరిగి నియోజకవర్గాల సంఖ్య పెరిగితేనే తమ పార్టీలకు మనుగడ, లేకపోతే అంతే .. అనే స్థితిలో పడిపోయారు!

ఒకసారి కాదు.. ఇప్పటికే సభలో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా సార్లు సమాధానాలు వచ్చాయి. అధికారికంగా మంత్రులు ఇచ్చిన ఆ సమాధానాల ప్రకారం 2026 వరకూ ఏపీ, తెలంగాణల్లో నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశాలు ఉండవు. అయితే వెంకయ్య వంటి నేతలు మాత్రం రాజ్యాంగందేముంది? అన్నట్టుగా.. నియోజకవర్గాల సంఖ్య పెరిగి తీరుతుందని ఇది వరకే నొక్కి వక్కాణించారు.

తెలంగాణ, ఏపీల్లో అధికార పార్టీ ల ప్రోద్భలం తో జరిగిన  ఫిరాయింపులకు బాసటగా నిలిచేందుకు వెంకయ్య ఆ ప్రకటన చేశాడు. అయితే.. అధికారిక సమాధానంలో మాత్రం పునర్విభజన జరిగే పని కాదని కేంద్రం స్పష్టం చేసింది. తెరాస నేతలు మాత్రం తమ రాజకీయం కోసం రాజ్యాంగ సవరణ తేవాలని అంటున్నారు, ఏపీ తెలుగుదేశం నేతలు కూడా నియోజకవర్గాల సంఖ్య పెరగాలని కోరుకుంటున్నారు.

అయితే అది ఆంధ్రాలో మాత్రమే జరగాలి, తెలంగాణలో మాత్రం కేసీఆర్ తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే నియోజకవర్గాల సంఖ్య పెరగాలని కోరుకుంటున్నాడు… అనేది టీడీపీ వెర్షను!

Show comments