కేంద్ర కేబినెట్‌లో మోడీ ఆప్త మిత్రుడికి చోటు!

ప్రధాని నరేంద్రమోడీ ఇక తన మంత్రివర్గాన్ని త్వరలోనే పునర్ వ్యవస్థీకరించవచ్చు. ఎందుకంటే.. తన అనుంగు సహచరుడికి విధిగా యూనియన్ కేబినెట్ లో ఘనమైన శాఖ ఏదో ఒకదానిని కట్టబెట్టాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. తన విజయాల్లో, వ్యూహాల్లో, పాలనలో, ఆచరణలో భాగస్వామిగా ఉండే అమిత్ షాకు నరేంద్ర మోడీ ప్రత్యుపకారం చేయబోతున్నారా? తాజాగా అమిత్ ను రాజ్యసభకు పంపడానికి రంగం సిద్ధం చేయడాన్ని గమనిస్తోంటే.. త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు ఇది శ్రీకారం అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. 

అమిత్ షా- నరేంద్ర మోడీల బంధం సామాన్యుల అంచనాలకు మించినది. నరేంద్రమోడీ గుజరాత్ లో విజయం సాధించడంలో అమిత్ షా చాలా కీలక భూమిక పోషించారని అంతా అంటారు. ఆయనే చాలా చక్రం తిప్పి వ్యూహాత్మకంగా వ్యవహరించి.. నరేంద్రమోడీ భాజపా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి కావడంలోనూ.. దేశవ్యాప్త పాజిటివ్ ఇమేజిని సొంతం చేసుకోవడంలోనూ.. తద్వారా ఘన విజయం దిశగా సారథ్యం వహించడంలోనూ అమిత్ పాత్ర చాలా ఉన్నదని సన్నిహితులు చెబుతుంటారు. 

దానికి తగ్గట్లుగానే నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత.. అమిత్ ప్రాభవం కూడా పెరిగింది. భాజపాలో ఆయనకు విలువ పెరిగింది. ఏకంగా రెండోసారి కూడా జాతీయ పార్టీ అధ్యక్షుడు అయ్యారు. పార్టీలో అయినా సరే, ప్రభుత్వంలో అయినా సరే.. అమిత్ కు తెలియకుండా నిర్ణయం ఏదీ జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి అమిత్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారు. తనకు ఇంతటి సన్నిహితుడు, వ్యూహచతురుడు ఎంపీ అయిన తర్వాత.. మోడీ ఊరకే ఎలా ఉండగలరు? ఆ వెంటనే ఆయనకు మంత్రి పదవికి కూడా కట్టబెడతారనే విశ్లేషణ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

ప్రస్తుతం కేంద్రంలో కీలకమైన మంత్రిత్వ శాఖలు కొన్ని ఖాళీగానే ఉన్నాయి. రక్షణశాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ గోవా సీఎం అయ్యాక అరుణ్ జైట్లీ ఆ బాధ్యత చూస్తున్నారు. వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థి అయ్యాక ఆయన చూసిన పట్టణాభివృద్ధి, సమాచర ప్రసార శాఖలను ఇతరులకు పంచారు. ఇవన్నీ కీలక శాఖలే! వీటిలో ఏదో ఒకటి అమిత్ షాకు దక్కవచ్చునని ప్రచారం జరుగుతోంది. మోడీ అవసరాల దృష్ట్యా సమాచార ప్రసార శాఖ గానీ.. లేదా రక్షణశాఖ గానీ దక్కుతుందని అంతా అనుకుంటున్నారు. 

Show comments