మాజీ సీఎం ఆత్మహత్య...విచిత్రం...విషాదం..!

మన దేశంలో రాజకీయ నాయకులు ఆత్మహత్యలు చేసుకోగా విన్నామా? ఉన్నత పదవులు అధిష్టించిన నేతలు ప్రాణాలు తీసుకున్న వార్తలు మన చెవుల పడ్డాయా? ఏదో ఒక అంశంపై, ఆకాంక్షపై ఉధృతంగా ఉద్యమాలు నడిపిని నాయకులు సైతం నిక్షేపంగా ఉన్నారు. ఉద్యమాల్లో సామాన్యులు, అమాయకులు ఆత్మబలిదానం చేసుకున్నారుగాని నాయకులు ఆ పని చేసిన దాఖలాలు లేవు. అవసరమైతే ప్రాణత్యాగం చేస్తామంటారుగాని చచ్చినా ఆ పని చేయరు. ఘోరంగా అవమానాల పాలైన నేతలు, కుంభకోణాలు చేసిన లీడర్లు వీలైతే తప్పించుకొని విదేశాలకు పారిపోతారుగాని ఆత్మహత్య చేసుకోరు. 

కాని అరుణాచల్‌ ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పాల్‌ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నారు. సరైన కారణాలు ఇంకా తెలియలేదుగాని ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ఆత్మహత్య చేసుకోవడం మన దేశంలో విచిత్రం...విషాదం. మంగళవారం తన  నివాసంలో ఉరేసుకున్నారు. ఇది ఆత్మహత్యగానే భావిస్తున్నారు. ఈయన ఎప్పుడో పాత తరం ముఖ్యమంత్రి కాడు. ఈ తరం నాయకుడే. ఇప్పటివాడే. ఈ ఏడాది మొదట్లో అరుణాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడిన సంగతి గుర్తుందా? ఈ ఏడాది పాల్‌ నాలుగున్నర నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 

గత నెలలో (జూలై) ఆయనకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో పదవికి రాజీనామా చేశారు. అరవై సీట్లున్న అరుణాచల్‌ అసెంబ్లీలో 18 మంది కాంగ్రెసు తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఇండిపెండెంట్లు, 11 మంది బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో ఫిబ్రవరిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పాల్‌ కంటే ముందు నబం తుకీ ముఖ్యమంత్రి. 47 మంది కాంగ్రెసు ఎమ్మెల్యేల్లో పాల్‌ సహా 21 మంది ముఖ్యమంత్రి మీద తిరుగుబాటు చేశారు. రాజకీయ సంక్షోభం ఏర్పడటంతో కేంద్రం రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయగా ప్రెసిడెంట్‌ ప్రణబ్‌ ముఖర్జీ జనవరి 26న రాష్ట్రపతి పాలనకు ఉత్తర్వులిచ్చారు. 

కేంద్ర ప్రభుత్వం కుట్ర కారణంగానే తిరుగుబాటు వచ్చిందని ఆరోపించిన కాంగ్రెసు పార్టీ సుప్రీం కోర్టుకెళ్లింది. కేసు విచారించిన కోర్టు పాల్‌ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించి పాత ప్రభుత్వాన్ని పునరుద్ధరించింది. అంతకుముందు కేంద్రం రాష్ట్రపతి పాలన ఎత్తేసిన కొన్ని గంటల్లోనే పాల్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌ తొమ్మిదో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈయన సర్కారుకు బీజేపీ బయటనుంచి మద్దతు ఇవ్వగా, ఇద్దరు ఇండిపెండెంట్లు ప్రభుత్వంలో చేరారు. పాల్‌ అసెంబ్లీని రద్దు చేసి కొత్తగా ఎన్నికలకు వెళతారనే ఊహాగానాలు చెలరేగాయి. కాని అలా జరగలేదు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన పాల్‌ వయసు 47 ఏళ్లు మాత్రమే.  Readmore!

పాల్‌ ఇంట్లో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ దొరకలేదు. దీంతో ఆత్మహత్యకు కారణం అర్థం కావడంలేదు. ప్రస్తుతం రాజధాని ఇటానగర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని వార్తలొస్తున్నాయి. పాల్‌ చివరిసారిగా కాంగ్రెసు సభ్యుడు నినాంగ్‌ ఎరింగ్‌తో మాట్లాడారు. ఆ సమయంలో ప్రజలు తనను మళ్లీ ఎన్నుకుంటారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఒంటరితనం వల్ల కలిగిన బాధతోనే పాల్‌ ఆత్మహత్య చేసుకున్నాడని అనుకుంటున్నారు. ఆయన ఇంకా ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేయలేదు. జీవితంలో ఢక్కామొక్కీలు తినే రాజకీయ నాయకులు ఎన్ని అపజయాలు ఎదురైనా కుంగిపోరు. శక్తి సామర్థ్యాలుంటే పోరాడుతారు లేదా రాజకీయాల నుంచి తప్పుకుంటారు. కాని అవమానం జరిగిందని ఆత్మహత్య చేసుకోరు.

Show comments

Related Stories :