సైకిల్‌.. స్వయంకృతాపరాధం.!

దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమది. అంత పెద్ద రాష్ట్రానికి అతి చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయ్యారు అఖిలేష్‌ యాదవ్‌. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే క్రమంలో కుమారుడికి ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్ని అప్పగించిన ములాయం సింగ్‌ యాదవ్‌, మొదట్లో కొడుకు 'తెలివితేటల్ని' చూసి మురిసిపోయారు. అద్భుతమైన పాలన అందిస్తున్నాడంటూ అఖిలేష్‌ని ప్రశంసిస్తూ పండగ చేసుకున్నారు. పుత్రోత్సాహంతో ఉప్పొంగిపోయారు. 

కానీ, అదే అఖిలేష్‌ యాదవ్‌ తండ్రికే వెన్నుపోటు పొడవడానికి సిద్ధమయ్యారు. సరిగ్గా, మొన్నటి ఎన్నికలకు ముందు జరిగిన తతంగమిది. చిన్నాన్న శివపాల్‌యాదవ్‌తో గొడవలే కావొచ్చు, ఇంకేదన్నా కారణం కావొచ్చు.. తండ్రిని కాదనుకునేంతలా అఖిలేష్‌ సొంత పార్టీలో మంత్రాంగం జరపడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. 'సమాజ్‌వాదీ పార్టీ నాది..' అంటూ ఎన్నికల కమిషన్‌ దాకా వెళ్ళారు అఖిలేష్‌. ములాయం తక్కువేమీ తిన్లేదు, తనయుడికి వ్యతిరేకంగా వ్యూహం రచించారు. కుదరక, కొడుకుతో రాజీకి వెళ్ళారు. 

ఇప్పుడిదంతా ఎందుకంటే, ఇదే మరి.. ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో సమాజ్‌వాదీ పార్టీని అత్యంత ఘోరంగా దెబ్బకొట్టింది. ఒకవేళ పార్టీలో ఈ స్థాయి సంక్షోభం లేకపోయి వుంటే, గెలవకపోయినా.. కనీసం 100 సీట్లు అయినా వచ్చి వుండేవేమో.! పెద్ద రాష్ట్రాల్లో 'సుస్థిరత' గురించి ఓటర్లు ఆలోచించడం మామూలే. ఏ రాష్ట్రంలో అయినా అంతే. ఉత్తరప్రదేశ్‌ ఓటర్లు కూడా అదే ఆలోచించారు. ఎప్పుడు విరిగిపోతుందో తెలియని సైకిల్‌ని నమ్ముకోవడం కంటే, మోడీని నమ్ముకోవడం బెటర్‌.. అనుకున్నారు.. అందుకే, బంపర్‌ మెజార్టీతో బీజేపీకి పట్టం కట్టారు. 

'ఈ పరాజయానికి అఖిలేష్‌ యాదవ్‌ కారణం.. తండ్రి ములాయంకి క్షమాపణ చెప్పి, పార్టీ పగ్గాలు అప్పగించెయ్యాలి..' అంటూ అప్పుడే సమాజ్‌వాదీ పార్టీలో అంతర్గత కలహాలు భగ్గుమన్నాయి. ఇప్పుడిక అఖిలేష్‌ యాదవ్‌ చెయ్యగలిగిందేమీ లేదు. కాంగ్రెస్‌ని నమ్ముకుని, నట్టేట్లో సమాజ్‌వాదీ పార్టీని ముంచేసిన అఖిలేష్‌.. విరిగిపోయిన సైకిల్‌ని, తండ్రి చేతుల్లో పెట్టెయ్యాల్సిందే. కానీ, తుక్కులా తయారైన సైకిల్‌ని బాగు చేయడం ములాయంకి సాధ్యమేనా.?

కొసమెరుపు: ఒకప్పుడు ఉత్తర్రపదేశ్ సైకిల్ - ఆంధ్రప్రదేశ్ సైకిల్ ఒక్కలాంటివేననీ.. రాజకీయాల్లో సైకిల్ ప్రభంజనం కొనసాగుతుందనీ, అక్కడ అఖిలేష్ - ఇక్కడ లోకేష్ తండ్రిని మించిన తనయులనీ చంద్రబాబు ఉప్పొంగిపోయారు.. అఖిలేష్ తండ్రిని ముంచిన తనయుడయ్యారు.. మరి లోకేష్, అయినా తండ్రిని మించిన తనయుడనిపించుకుంటారా.? తెలంగాణలో ఇప్పటికే పార్టీని ముంచేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ లోనూ లోకేష్ ముంచేస్తారా.? వేచి చూడాల్సిందే.

Show comments