మమ్మల్ని ఓడించలేదు.. మేమే ఓడిపోయాం.!

వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే సిద్ధాంతాలు ఎన్నయినా చెప్పొచ్చు.! ఈ విషయంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు 'మాస్టర్‌ డిగ్రీ' ఎప్పుడో సాధించేశారు. రాజకీయాల్లో ఆయన్ని ఎవరూ ఎప్పుడూ ఓడించలేదట, కొన్ని తొందరపాటు నిర్ణయాల కారణంగా తమంతట తామే ఓడిపోయామని సెలవిచ్చారు చంద్రబాబు. ఓడిపోవడమేంటి.? ఓడించడమేంటి.? ఓడింది చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ.. ఓడించింది తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు. 

2004 ఎన్నికల్లో, 2009 ఎన్నికల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలయ్యింది.. ప్రతిపక్షంలో కూర్చుంది. కానీ, అది ఓటమి కాదనేలా చంద్రబాబు మాట్లాడటం ఇప్పుడు కొత్తగా జరుగుతున్నదేమీ కాదు.. ఆ ఓటమికి ప్రజలదేనని చెబుతుంటారాయన.! వ్యక్తిగతంగా చంద్రబాబుకి ఎప్పుడూ ఓడిపోని రికార్డ్‌ వుంటే వుండొచ్చుగాక.. అది వేరే విషయం. 

పుత్రరత్నం చినబాబేమో, ఒకే దేశం ఒకే ఎన్నికల అంశానికి వ్యతిరేకంగా మాట్లాడుతోంటే, చంద్రబాబు మాత్రం ఇంకోసారి ఒకే దేశం ఒకే ఎన్నికల అంశానికి తాను సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఒకే దేశం ఒకే ఎన్నికల ద్వారా ప్రాంతీయ పార్టీలకు నష్టమనే వాదననీ చంద్రబాబు కొట్టి పారేశారు. పైగా, ఒకేసారి దేశంలో, రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలకే లాభమని సెలవిచ్చారు. 'ఎవర్ని గెలిపించాలో ప్రజలు నిర్ణయించుకుంటారు..' అంటూ గెలుపోటముల గురించి చంద్రబాబు భలే తెలివిగా చెప్పుకొచ్చారండోయ్‌.! అక్కడికేదో, ఆయన ఈ గొప్ప విషయాన్ని కనుగొన్నట్టుంది కదూ.!

Show comments