మెగాస్టార్‌.. చీకట్లోంచి వెలుగులోకి.!

మెగాస్టార్‌ చిరంజీవి చీకట్లోంచి వెలుగులోకి వస్తున్నారు. నిజ్జంగా నిజమిది. 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాకి సంబంధించి తాజా పోస్టర్‌ ఈ నెల 29న విడుదల కానుంది. ఆల్రెడీ సినిమాకి సంబంధించి చాలా లుక్స్‌ బయటకు వచ్చేశాయి. అఫీషియల్‌గా విడుదల చేసిన లుక్స్‌లో చిరంజీవి 'డార్క్‌'లో వుండిపోయారు. ఆయన షేడ్‌ మాత్రమే కన్పించేలా వాటిని 'డిజైన్‌' చేశారు మరి.! 

అయితే, 'ఖైదీ నెంబర్‌ 150' సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ చేస్తున్న లక్ష్మీరాయ్‌, చిరంజీవితో సెట్స్‌లో వున్న ఫొటోని విడుదల చేసేయడం గమనార్హం. ఆ మాటకొస్తే, 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా షూటింగ్‌ ప్రారంభమైన తర్వాత దఫ దఫాలుగా చిరంజీవి స్టిల్స్‌ బయటకు వస్తూనే వున్నాయి. అవన్నీ షూటింగ్‌ స్పాట్‌లోనివే. వీటన్నిటితోనూ అభిమానులు అప్పుడే ఓ రేంజ్‌లో పండగ చేసేసుకుంటున్నారు. 

ఇక, ఇప్పుడు అధికారికంగా సినిమా పోస్టర్‌ని విడుదల చేయనున్నారు. గతంలోలా డార్క్‌లో కాకుండా, సూపర్బ్‌ స్టిల్‌ని సెలక్ట్‌ చేశారట. అది ఐటమ్‌ సాంగ్‌కి సంబందించిన స్టిల్‌ అన్న ప్రచారం జరుగుతోంది. మరోపక్క, ఒకటి కాదు.. రెండు స్టిల్స్‌ రాబోతున్నాయనీ, అందులో ఒకటి 'ఖైదీ' గెటప్‌ అనీ తెలుస్తోంది.

Show comments