గీతాంజలి నిర్మాత అరెస్టు

గీతాంజలి, శంకరాభరణం సినిమాలు నిర్మించి, మంచు విష్ణుతో లక్కున్నోడు సినిమా నిర్మిస్తూ, ఆ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న ఎం వి వి సత్యనారాయణను విశాఖ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఎంవివి సత్యనారాయణ విశాఖలో నెంబర్ వన్ బిల్డర్. అయితే ఆయన ఎక్కువగా భూ ఆక్రమణలకు పాల్పడుతుంటారని ఆరోపణలు, విమర్శలు వున్నాయి. 

ఈ నేఫథ్యంలో విశాఖ సమీపంలోని మధురవాడలో తాను నిర్మించిన అపార్ట్ మెంట్ పక్కన వున్న స్థలాలు కోన్నింటిని ఆక్రమించారని, ఆ స్థల యజమానులను బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు పోలీసుల విచారణ జరిపి, ఎంవివి ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

అయితే ఇదంతా తనపై తెలుగు దేశం నాయకుడు కళా వెంకటరావు చేస్తున్న కుట్ర అని ఎంవివి ఆరోపిస్తున్నారు. కళా వెంకటరావు అంటే ఇటు లోకేష్ కు అత్యంత ఆప్తుడు. అటు తెలుగుదేశం కార్య నిర్వాహక అధ్యక్షుడు. గతంలోనే ఎంవివి భూ దందాలపై స్థానిక ఎడిషన్ లో విపరీతంగా కథనాలు వచ్చాయి. మళ్లీ ఆ తరువాత చల్లారాయి. ఇప్పుడు ఈ అరెస్టుతో మళ్లీ హడావుడి మొదలైంది.

Show comments