ఫిలింఫేర్‌కి 'చిన్న'తనం.!

ఒకప్పుడు నంది అవార్డులంటే అదో గొప్ప. కానీ, ఇప్పుడు ఫిలింఫేర్‌ పురస్కారాలకున్న 'క్రేజ్‌' అంతా ఇంతా కాదు. 'నంది' అవార్డుల వేడుక సాదా సీదాగా జరుగుతుంది. ఫిలింఫేర్‌ పురస్కారాల ఈవెంట్‌, అంతర్జాతీయ స్థాయి హంగులతో జరుగుతుంటుంది. 'కొనుక్కుంటే ఫిలింఫేర్‌లు వస్తాయ్‌..' అనే విమర్శలు అంటు నంది పురస్కారాలకీ వున్నా, ఫిలింఫేర్‌ పురస్కారాలపై ఆ 'అమ్మకం' ఆరోపణలు చాలా చాలా ఎక్కువ. ఇక, ఫిలింఫేర్‌ నిర్వాహకులకి సినీ పరిశ్రమ అంటే గౌరవం చాలా చాలా తక్కువ. ఈవెంట్‌ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించడం తప్ప, 'గౌరవం' అన్న మాట నిర్వాహకుల్లో పెద్దగా కన్పించదంటారు. 

ఇక, అసలు విషయానికొస్తే, 'క్షణం' చిత్రంలో నటించిన అడివి శేష్‌, బుల్లితెర బ్యూటీ అనసూయ భరద్వాజ్‌కి ఫిలింఫేర్‌ కమిటీ ఆహ్వానమే పంపకపోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. 'ఆహ్వానం పంపలేదుగానీ, సరిగ్గా వేడుకల నిర్వహణకు గంట ముందు, క్షమాపణ మాత్రం చెప్పారు..' అంటూ అడవి శేష్‌, సోషల్‌ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు. మరోపక్క, అనసూయ అయితే 'నాకు క్షమాపణ కూడా చెప్పలేదు..' అంటూ అసహనం వ్యక్తం చేసింది. 

'క్షణం' సినిమా అప్పట్లో మంచి విజయాన్నే అందుకుంది. అడవి శేష్‌ పలు చిత్రాలతో ఇప్పుడిప్పుడే నటుడిగా ఎదుగుతున్నాడు. అనసూయ సంగతి సరే సరి. వీళ్ళద్దర్నీ ఫిలింఫేర్‌ 'చిన్నస్థాయి' నటీనటులని అనుకుని వుండొచ్చుగాక. 'నామినేట్‌' చేసి మరీ, వేడుకలకి ఆహ్వానించకపోవడమంటే, పనిగట్టుకుని అవమానించాలన్న ఉద్దేశ్యం నిర్వాహకుల్లో వుందా.? అన్న అనుమానాలు రాకుండా ఎలా వుంటాయి.? 

'చిన్నోళ్ళ' విషయంలోనే కాదు, పెద్దోళ్ళ విషయంలోనూ ఫిలింఫేర్‌ ఇలాగే వ్యవహరిస్తుంటుంది. అవార్డులంటే కొందరికి ఇష్టముండదు.. అలాగని, మంచి నటనా ప్రతిభను ప్రదర్శించినవారిని అవార్డుల కమిటీ ఎలా లైట్‌ తీసుకుంటుంది.? ఫిలింఫేర్‌లో మాత్రం అలాంటివే జరుగుతుంటాయి. ప్రతిభ ఆధారంగా తమ ఈవెంట్‌కి 'గ్లామర్‌' తీసుకొచ్చేవారిని ఎంచుకుని మరీ అవార్డులిస్తుందన్న ఆరోపణలు ఫిలింఫేర్‌ మీద కోకొల్లలు. ఇలంటి చీప్‌ట్రిక్స్‌ ఫిలింఫేర్‌ గౌరవాన్నే తగ్గిస్తాయని నిర్వాహకులెప్పుడు తెలుసుకుంటారో ఏమో.!

Show comments