బాబు నటన ముందు ఆయనెంత.?

టీడీపీ ఎంపీ శివప్రసాద్‌, సినీ నటుడు కూడా. దాంతో, ఆయన రాజకీయాల్లోనూ 'నటనా ప్రతిభను' చాటుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. దేశ రాజకీయాల్లో బహుశా 'శివప్రసాద్‌' వేసినన్ని 'వేషాలు ఇంకెవరూ వేసి వుండరేమో. అంబేద్కర్‌ గెటప్‌ వేశారు, రాముడి గెటప్‌ వేశారు, ఇంకా చాలా చాలా గెటప్‌లు వేసేశారు. ఏం చేసినా, ఆయనదో స్టయిల్‌. తన నిరసనను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో శివప్రసాద్‌ తన నటనానుభవాన్ని అలా వినియోగించుకుంటారు. 

ఇప్పటిదాకా ఆయన తెలుగుదేశం పార్టీకి వీరవిధేయుడు. కానీ, ఇప్పుడు కాదు. అతి త్వరలో పార్టీ నుంచి ఆయన్ని గెంటేసేందుకు ప్రయత్నాలు షురూ అయ్యాయి. ఇక్కడో పాత సామెతను గుర్తు చేసుకోవాలి. ఓ జంతువుని చంపాలంటే, దానిపై 'పిచ్చిది లేదా ప్రమాదకారి‘ అన్న ముద్ర వేసెయ్యాలి. అది పెంపుడు జంతువు అయినాసరే. ఓ ఎంపీని, దళిత ఎంపీ విషయంలో ఈ ప్రస్తావన రావడం సబబు కాదుగానీ, పార్టీ నుంచి గెంటి వేయడానికిగాను, శివప్రసాద్‌ మీద 'ఆరోపణల' పర్వానికి టీడీపీ తెరలేపడం చూస్తోంటే, ఆ తరహా కుట్ర గుర్తుకురాకుండా వుండదు. 

హథీరామ్‌ భూములపై శివప్రసాద్‌ కన్నేశారట. దాన్ని ప్రభుత్వం తిరస్కరించిందట. అందుకని, వ్యక్తిగత ఎజెండాతో శివప్రసాద్‌ పార్టీపై బురద జల్లుతున్నారట. అయినా శివప్రసాద్‌, గళం విప్పింది దేనికోసం.? తన సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో అవకాశం కల్పించలేదనే కదా.! ప్రత్యేక హోదా విషయంలో ఎలాగూ శివప్రసాద్‌ గొంతు నొక్కేశారు చంద్రబాబు. నిజానికి ప్రత్యేక హోదా గురించి టీడీపీలో గట్టిగా ఎవరన్నా మాట్లాడారంటే అది ఆయన మాత్రమే. ఇప్పుడిలా, తన సామాజిక వర్గం గురించి ప్రశ్నించగానే, 'అవినీతిపరుడు' అన్న ముద్ర వేసేశారు. అది కూడా స్వయానా చంద్రబాబే కావడం గమనార్హం. 

'పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం.. పార్టీకి నష్టం కలిగించేలా అవినీతి చర్యలకు ఉపక్రమించడం దారుణం..' అంటూ చంద్రబాబు ఫైర్‌ అయ్యారట. అది తన అనుకూల మీడియాలో వచ్చేలా ముందే లీకులు పంపేశారు. ఇంకేముంది, మేటర్‌ క్లియర్‌. శివప్రసాద్‌పై వేటు ఖాయం. ఆ వేటు తప్పదన్న భయంతో శివప్రసాద్‌, చంద్రబాబు దార్లోకే వెళతారా.? లేదంటే, చంద్రబాబుకి ఎదురుతిరుగుతారా.? 

ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, స్వతహాగా నటుడే అయినా శివప్రసాద్‌ నటన, చంద్రబాబు ముందు ఎంత.?

Show comments