దర్శకరత్న దాసరి నారాయణరావు తీవ్ర అనారోగ్యంతో హైద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై వైద్య చికిత్సను అందిస్తున్నారు. దాసరి నారాయణరావుని వెంటిలేటర్‌పై వుంచామనీ, ఆయనకు డయాలసిస్ చేస్తున్నామనీ, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో దాసరి బాధపడ్తున్నారనీ, చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని కిమ్స్ వైద్యులు వెల్లడించారు.
ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ని తగ్గించేందుకుగాను వైద్యులు కాస్సేపట్లో దాసరి నారాయణరావుకి శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు. శస్త్ర చికిత్స అనంతరం మరోసారి హెల్త్ బులెటిన్‌ని విడుదల చేస్తామంటోంది 'కిమ్స్' వైద్య బృందం. కాగా, దాసరి తీవ్ర అనారోగ్యంతో కిమ్స్‌లో చేరారన్న విషయం తెలుసుకుని, పలువురు సినీ ప్రముఖులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినీ నటుడు, నిర్మాత మోహన్‌బాబు, దాసరి నారాయణరావుని కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితులపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావు, తెలుగు సినీ పరిశ్రమలో దర్శకరత్నగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ ఆయన్ని పెద్ద దిక్కుగా భావిస్తోంది. దర్శకుడిగానేకాక, 50కి పైగా చిత్రాల్ని ఆయన నిర్మించారు కూడా. నటుడిగానూ వెండితెరపై పలు సినిమాల్లో కన్పించారు. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారాయన. భార్య దాసరి పద్మ మరణానంతరం, దాసరి మానసికంగా కుంగిపోయారు. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో చెబుతూ వచ్చేవారు. ఏదిఏమైనా, దాసరి నారాయణరావు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.