రోడ్డెక్కాలంటే 'నాయుళ్లు' అనుమతించాలా?

పవర్‌ స్టార్‌ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే పవన్‌ కళ్యాణ్‌ ఎవరు? ఆయన సినిమా హీరోనా? రాజకీయ నాయకుడా? హీరో అని అందరికీ తెలుసు. రాజకీయ నాయకుడు అవునో కాదో ఇంకా తేల్లేదు. దానికి ఇంకా సమయం రానట్లుంది. తాజాగా ఆయన మాట్లాడిన మాటల్నిబట్టి చూస్తే ప్రభుత్వ కార్యాలయంలోనో, ప్రయివేటు సంస్థలోనో పనిచేస్తున్న అధికారా? అనే అనుమానమొస్తోంది. కార్యాలయాల్లో పనిచేసే ఉన్నతాధికారులు కింది ఉద్యోగులు పెద్ద తప్పు చేసినప్పుడు అంటే క్షమించరాని నేరం చేసినప్పుడు ఉద్యోగంలోనుంచి తీసేయాలనుకుంటారు లేదా ఏదైనా కఠిన చర్య తీసుకోవాలనుకుంటారు. తప్పు చేసిన సదరు ఉద్యోగికి ఈ విషయమై తెలియచేస్తూ 'మీరు ఫలాన తప్పు లేదా నేరం చేసి సంస్థ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారు. ఇందుకుగాను మిమ్మల్ని ఉద్యోగంలోంచి ఎందుకు తీసేయకూడదో తెలియచేయండి' అంటూ లేఖ పంపుతారు. దీన్నే షోకాజ్‌ నోటీసు అంటారు. 

పవన్‌ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడులను ప్రశ్నించిన తీరు వారికి షోకాజ్‌ నోటీసు ఇచ్చినట్లుగా ఉంది. 'ప్రజా సమస్యలను వారు ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. అలాంటప్పుడు నేను రోడ్డు పైకి వచ్చి ఎందుకు నిరసన తెలపకూడదో చెప్పాలి' అన్నారు ఆవేశంగా. పవన్‌ కళ్యాణ్‌ నిరసన తెలియచేయాలో వద్దో చెప్పడానికి నాయుళ్లు ఎవరు? ఈయన వాళ్లను అడగడమేమిటి? తాను నిరసన తెలియచేస్తానని వారిని హెచ్చరించాడా? లేదా మీ అనుమతితో నిరసన తెలియచేస్తానని చెప్పాడా? 'ప్రజా సమస్యలపై మీరు రోడ్డెక్కండి' అనే కదా ప్రజలు అడుగుతున్నారు. ఎంతోకాలం నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది తెలిసి కూడా నిరసన ఎందుకు తెలపకూడదో చెప్పాలి అనడంలో అర్థముందా? 

'నేను లేస్తే మనిషిని కాను' అనే సామెత పవన్‌కు సరిగ్గా సరిపోతుంది. ఇప్పటివరకు మాటలే తప్ప చేతలు లేని పవన్‌ గురించి వాస్తవాలు  చెప్పినందుకు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆయన ఆగ్రహానికి గురి కావల్సివచ్చింది. నాయకుడంటే యుద్ధంలో ఉంటాడు తప్ప మాటలు చెబుతూ కూర్చోడు. ఆర్‌జీవి ఇదే చెప్పారు. తప్పేముంది? పవన్‌ తన అభిమానులకు 'పవర్‌ స్టార్‌' అయ్యుండొచ్చు. కాని తన పవర్‌ ఏమిటో ఇప్పటివరకు చేతల్లో చూపించలేదు. 'నాది కాకపోతే కాశీ వరకు డేకుతా' అన్నాడట వెనకటికి ఒకడు. 'ఉత్తరాదిపై తిరగబడతాం' అనే పవన్‌ తాటాకు ఆవేశం అలాగే ఉంది. దక్షిణాది రాష్ట్రాల ఆత్మగౌరవ సభ నిర్వహించాలనే ఆలోచన ఏమిటో అర్థం కావడంలేదు. ఆంధ్రుల తరపున పోరాడే నాయకుడిగా ముందు గుర్తింపు పొందితే తరువాత దక్షిణాది మొత్తం గురించి ఆలోచించవచ్చు. ఇప్పటివరకు తాను రోడ్డెక్కలేదు. కాని దక్షిణాది మొత్తానికి నాయకుడిగా ఫీలవుతున్నట్లుంది. మిగిలిన దక్షిణాది రాష్ట్రాలవారు తమకు అన్యాయం జరుగుతుందునుకుంటే వారే పోరాటం చేస్తారు. ఆయా రాష్ట్రాల్లో రోడ్ల మీదికొచ్చి పోరాటం చేసేవారు చాలామంది ఉన్నారు. ముందు ఆంధ్ర రాష్ట్ర సమస్యల గురించి ఆలోచిస్తే అదే పదివేలు.

ఇక ప్రజల కోసం పనిచేయడమే తనకు-చంద్రబాబుకు మధ్య ఉన్న ఉమ్మడి అజెండా అని పవన్‌ చెప్పారు. ప్రజల కోసం తాను అనేక పనులు చేస్తున్నానని చంద్రబాబు రోజూ చెప్పుకుంటూనే ఉన్నారు. మరి ప్రజల కోసం ఇప్పటివరకు తానేం చేశాడో పవన్‌ చెప్పగలడా? తాను అధికార పార్టీలకు (టీడీపీ, బీజేపీ) మిత్రుడనో, ప్రత్యర్థి అనో స్పష్టంగా చెప్పలేని పవన్‌ ప్రజల కోసం ఏం చేశానని చెబుతాడు? ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని, ఆర్‌కే బీచ్‌లో మెరీనా తరహా నిరసన కార్యక్రమం చేయాలని పిలుపు ఇచ్చి తాను మాత్రం రాలేదు. ఇందుకు కారణమేంటో స్పష్టంగా చెప్పాలి కదా. Readmore!

ఈ పిలుపు ఇచ్చింది సినిమా హీరోగా కాదు. జనసేన పార్టీ అధినేతగా. అంటే రాజకీయ నాయకుడిగా. అలాంటప్పుడు రాజకీయ నాయకుడు అనేవాడు ఉద్యమిస్తున్న ప్రజల మధ్యకు రావాలి కదా. ప్రత్యేక హోదా కోసం మూడంచెలుగా పోరాటం చేస్తానని చెప్పిన పవర్‌ స్టార్‌ ఆ తరువాత దానికి కార్యాచరణ ఎందుకు ప్రకటించలేదు? ఏం ఇబ్బంది వచ్చింది? 'ప్రత్యేక హోదా తీసుకురావడంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అంశాలేమిటో ప్రజలకు వివరించండి' అని చంద్రబాబు ఉద్దేశించిన అన్న ఈ హీరో అదే సూత్రం తనకూ వర్తింప చేసుకోవాలి కదా. వచ్చే ఎన్నికల వరకు పవన్‌ కళ్యాణ్‌ 'అర్థనారీశ్వర తత్వం' (సగం హీరో, సగం పొలిటీషియన్‌) ఇలాగే కొనసాగుతూ ఉంటుందేమో....!

Show comments