'బండ' బద్దలైతే.. 'బతుకు' బస్టాండే

బండ బద్దలైపోతోంది.. బతుకు బస్టాండయిపోతోంది.. ఇడియట్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి హద్దూ అదుపూ లేకుండా పోయింది. కామెడీ పేరుతో అసభ్యకరమైన స్కిట్స్‌.. డాన్సుల పేరుతో హద్దులు మీరిన ఎక్స్‌పోజింగ్‌.. అబ్బో, చెప్పుకుంటూ పోతే, ఇడియట్‌ బాక్స్‌.. అనే పేరుని ప్రస్తుతం టెలివిజన్‌ సార్థకం చేసేసుకుంటోంది. 

ఏం చేసినా, టీఆర్పీ రేటింగులు ముఖ్యం.. అనే కాన్సెప్ట్‌తోనే దాదాపు చాలావరకు ఛానల్స్‌ పనిచేస్తున్నాయి. న్యూస్‌ ఛానల్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌.. ఏదైనా ఒకటే. న్యూస్‌ ఛానళ్ళలో అయితే హత్యలు, అతాచారాలకు సంబంధించిన న్యూస్‌కి వచ్చే వ్యూయర్‌షిప్‌, మిగతావాటికి రావట్లేదాయె. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌ గురించి కొత్తగా చెప్పేదేముంది.? కొత్త సినిమాల్ని మించి, ఇతరత్రా ప్రోగ్రామ్స్‌ టీఆర్పీ రేటింగులు రాబట్టేసుకుంటున్నాయి. 

ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్స్‌లో 'కుటుంబ తగాదాలు' హాట్‌ టాపిక్‌. సినీ ప్రముఖులు వీటికి న్యాయ నిర్ణేతలు. కాదు కాదు, వ్యాఖ్యాతలు. వ్యాఖ్యాతలైతే మాత్రం, ఉత్తినే మాట్లాడేసి ఊరుకుంటారా.? కాస్తంత 'పెప్‌' జోడించాలి. 'చెంప పగలగొడతా' అనే హెచ్చరికలే కాదు, అసభ్యకరమైన తిట్లతోనూ విరుచుకుపడ్తున్నారు వ్యాఖ్యాతలుగా వున్న సెలబ్రిటీలు. దాదాపు అన్నిట్లోనూ ఒకటే కంటెంట్‌. ఒక భర్త, ఇద్దరు భార్యలు. అత్తా కోడళ్ళ గొడవలు షరామామూలే. 

షో అంతా రచ్చ రంబోలానే. చివర్లో ముగింపు ప్రశాంతం. ఒప్పంద పత్రాలపై సంతకాలు కూడా అయిపోతున్నాయి. ఇలాగైతే న్యాయస్థానాలు ఎందుకట.? లెస్బియన్లను తీసుకొచ్చేశారు ఓ షో కోసం. అదిప్పుడు వివాదమై కూర్చుంది. 'ఖబడ్దార్‌.. మా కమ్యూనిటీని విమర్శిస్తావా.?' అంటూ సదరు వ్యాఖ్యాతపై గుస్సా అవుతున్నారు లెస్బియన్లు. ఎక్కడికి వెళుతోంది సమాజం.? 

టీఆర్పీ రేటింగుల కోసం ఇంత హేయమైన చర్యలేంటో ఎవరికీ అర్థం కాకుండా తయారయ్యింది. సెలబ్రిటీలు చేస్తున్న 'షోలు' కావడం, డ్రమెటిక్‌ సీన్స్‌లా అనిపిస్తున్నా, ఓ కోణంలో ఎంటర్‌టైనింగ్‌గా వుండడంతో, కుటుంబాల్లో కల్లోలాల్ని కూడా ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేసేస్తున్నారు. పైశాచిక ఆనందం అంటే ఇదేనేమో కదా.!

Show comments