కూత సరే.. మంత్రిగారెక్కడ.?

ఆంధ్రప్రదేశ్‌కి కొత్త రైలొచ్చింది. అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి విజయవాడ మార్గంలో తొలి రైలు ఇదే కావడం గమనార్హం. ఈ రైలు ద్వారా రాయలసీమకీ, రాజధాని అమరావతికీ కనెక్టివిటీ కల్పించడం అభినందించదగ్గ విషయమే. పొద్దున్నే ధర్మవరం నుంచి విజయవాడకు బయల్దేరి, తిరిగి సాయంత్రానికి విజయవాడ నుంచి ధర్మవరం చేరుకునేందుకు అనుగుణంగా ఈ రైలుని ఏర్పాటుచేశారు. 

అంతా బాగానే వుందిగానీ, రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభు ఈ కొత్త రైలుని ఢిల్లీ నుంచి ప్రారంభించడమే కాస్త ఇబ్బందికరంగా తయారైంది. ప్రస్తుతానికి సురేష్‌ ప్రభు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో కాస్త వెసులుబాటు చూసుకుని ధర్మవరంలో రైలుని ప్రారంభించి వుంటే బావుండేదన్న వాదనలు తెరపైకొస్తున్నాయి. 

ఎలాగైతేనేం, ఆంధ్రప్రదేశ్‌కి ఇటీవలి కాలంలో రెండు కొత్త రైళ్ళొచ్చాయి. అందులో పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌కి సేవలందించే రైలు ఇదొక్కటే. కొద్ది రోజుల క్రితమే హైద్రాబాద్‌ నుంచి విజయవాడకు కొత్త రైలును ఏర్పాటు చేశారు. ఇది కూడా 'ఎక్స్‌క్లూజివ్‌'గా ఆంధ్రప్రదేశ్‌ అవసరాల కోసమే అన్నట్లు రూపొందించారనుకోండి.. అది వేరే విషయం. హైద్రాబాద్‌ నుంచి అమరావతికి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వెళ్ళేందుకు వీలుగా ఈ రైలుని ఆదివారం మినహా మిగతా అన్ని రోజులూ తిరిగేలా ఏర్పాటు చేశారు. 

ఇక, ధర్మవరం - విజయవాడ రైలు వారంలో మూడు రోజులపాటు నడుస్తుంది. ముందు ముందు 'ఆక్యుపెన్సీ - డిమాండ్‌'ని బట్టి రోజువారీ నడిపేలా చర్యలు తీసుకోబోతున్నారు. మరోపక్క విశాఖ నుంచి విజయవాడకు డబుల్‌ డెక్కర్‌ ట్రైన్‌ దాదాపుగా ఖరారయ్యింది. సరైన ముహూర్తం కోసం ఎదురుచూస్తోంది ఆ రైలు. 

Readmore!

అన్నట్టు.. ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశాల్లో బిజీగా వున్న సమయంలో అటు రైల్వే శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్‌కి రాకుండానే ధర్మవరం - విజయవాడ రైలు ఎలాంటి హంగామా లేకుండా ప్రారంభమయిపోవడం విశేషమే మరి. రైల్వే మంత్రిగారొస్తే, రైల్వే జోన్‌ డిమాండ్‌ నినాదాలు వస్తాయనా.? లేదంటే.. ఇంకేమన్నా ఇతరత్రా కారణాలతో ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయలేదా.? మామూలుగా అయితే రాజకీయ నాయకులు పబ్లిసిటీకి దూరంగా ఎలాంటి పనులూ చేయరు. సురేష్‌ప్రభు అందుకు పూర్తి భిన్నం అనుకోవాలా.? ఏమో మరి, ఆయనకే తెలియాలి.

Show comments