'జనతా గ్యారేజ్' తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేసే సినిమా ఏంటి.? అభిమానుల్ని టెన్షన్ పెడ్తున్న విషయమిది. 100 కోట్ల గ్రాస్ అతి తక్కువ రోజుల్లోనే దాటేసిందనీ, 70 కోట్ల రూపాయల మార్క్ దాటేసి, 80 కోట్ల దిశగా పరుగులు పెడ్తోందనీ 'జనతా గ్యారేజ్' గురించిన ప్రచారం జోరుగా సాగుతున్న దరిమిలా, అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ తదుపరి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకోవడంలో వింతేముంది.?
అయితే, ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించేదెవరన్నదానిపై మూడు ఆప్షన్స్ కన్పిస్తున్నాయి. అందులో ఫస్ట్ వన్, పూరి జగన్నాథ్. సెకెండ్ వన్ అనిల్ రావిపూడి. థర్డ్ వన్ వక్కంతం వంశీ. వాస్తవానికి, వక్కంతం వంశీ పేరు ఫస్ట్ ఆప్షన్‌గా వుండాలి. ఎందుకంటే, చాలాకాలంగా వక్కంతం వంశీ, జూనియర్ ఎన్టీఆర్ వెంటపడ్తున్నాడు. రచయిత అయిన వక్కంతం వంశీ, ఎన్టీఆర్ సినిమాతోనే దర్శకుడిగా మారతానని భీష్మించుక్కూర్చున్నాడిప్పటిదాకా.
'వంశీ కథ ఇంకా నా దగ్గరే వుంది..' అని చెప్పాడే తప్ప, వక్కంతం వంశీతో తదుపరి చిత్రాన్ని చేస్తానని ఇప్పటిదాకా ఎప్పుడూ ఎక్కడా ప్రకటించలేదు ఎన్టీఆర్. మరోపక్క, పూరి జగన్నాథ్ ప్లేస్‌లోకి అనిల్ రావిపూడి వచ్చాడనే ప్రచారం జరుగుతోంది. 'పటాస్', 'సుప్రీం' చిత్రాల్ని తెరకెక్కించి బ్యాట్ బ్యాక్ రెండు సక్సెస్‌ఫుల్ చిత్రాల్ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి. అయినాసరే, తన స్టార్‌డమ్ ముందు అనిల్ రావిపూడి నిలబడగలడా.? అన్న సందేహం ఎన్టీఆర్‌లో వుండొచ్చుగాక.!
అందుకే, ఎన్టీఆర్ ఇప్పుడు బోయపాటి శ్రీనుకి లైనేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. మూడు ముక్కలాట కాదిది, నాలుగు స్తంభాలాట.. ఆనాల్సి వస్తుందేమో ఇప్పుడు. బోయపాటితో ఎన్టీఆర్ ఇదివరకే ఓ సినిమా చేసి వున్నాడు. అదే 'దమ్ము'. ఏమో, ఆ ముగ్గురూ (పూరి, అనిల్, వంశీ) ఔట్ అయిపోయి, బోయపాటి ఫైనల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.