రేవంత్‌రెడ్డిని మళ్ళీ 'లాక్‌' చేస్తారా.?

మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు మద్దత్తుగా టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నిన్నటినుంచి దీక్ష చేస్తున్న విషయం విదితమే. నేటి సాయంత్రం ఆయన దీక్ష ముగియనుంది. అయితే, దీక్షకు బయలుదేరుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి నోరు పారేసుకున్న ఘటనకు సంబంధించి, టీఆర్‌ఎస్‌ నేతల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. 

రాజకీయ నాయకులన్నాక ఆరోపణలు, ప్రత్యారోపణలు సహజం. అయితే, ఈ మధ్యకాలంలో రేవంత్‌రెడ్డి, హద్దులు దాటి మరీ తెలంగాణ ముఖ్యమంత్రిపై విరుచుకుపడిపోతున్నారు. రాజకీయాల్లో ఎంత గట్టిగా నోరు పారేసుకుంటే, అంత పాపులర్‌ అవ్వొచ్చన్న రాజకీయ సూత్రాన్ని తెరపైకి తెచ్చింది టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ ఉద్యమం పేరుతో, ఆయన అప్పట్లో నోటికొచ్చినట్లు మాట్లాడారు. నువ్వు నేర్పిన విద్యే కదా.. అంటూ రేవంత్‌రెడ్డి ఇప్పుడు, కేసీఆర్‌పై నోరు పారేసుకుంటున్నారంతే. 

ఇక, రాజకీయాల్లో వున్నవారికి కేసులు కొత్తేమీ కాదు. ఓటుకు నోటు కేసులో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిపోయినా ఏం జరిగింది.? రేవంత్‌రెడ్డి కొన్నాళ్ళు రిమాండ్‌ ఖైదీగా వున్నారు.. ఆ తర్వాత ఊరట పొందారు. సో, ఇప్పుడు నమోదయ్యే కేసు లేదా కేసులు.. రేవంత్‌రెడ్డికి కొత్తగా తెచ్చిపెట్టే ఇబ్బందులేవీ వుండకపోవచ్చు. అయితే, రేవంత్‌రెడ్డి మీద కసి తీర్చుకోడానికి మాత్రం టీఆర్‌ఎస్‌కి ఓ ఛాన్స్‌ ఈ రూపంలో దక్కింది. 

రాజకీయ నాయకులు చేసిన ఆరోపణల నేపథ్యంలో వారిపై కేసులు పెట్టి, జైలుకు పంపించాల్సి వస్తే.. దేశంలో అసలంటూ రాజకీయ నాయకుడన్న మాటకే ఆస్కారం వుండదు. అంతకు మించి, దేశంలో జైల్లేవీ ఖాళీగా వుండవు. సో, రేవంత్‌రెడ్డిని కేసులతో లాక్‌ చెయ్యాలనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు. అదే సమయంలో, రాజకీయాల్లో నోరు పారేసుకోవడమే పరామవధి.. అన్నట్లు వ్యవహరిస్తే, అదీ హాస్యాస్పదమే.  Readmore!

Show comments

Related Stories :