బాబుకు ఉన్న పవరేంటో తెలుస్తుందిప్పుడు!

ఇప్పటి వరకూ తను ఎన్నో విప్లవాత్మక సలహాలు, సూచనలు ఇచ్చానని బాబు చెప్పుకోవడమే కానీ, దీని వెనుక ఉన్న కహానీలు ఏమిటో ఎవరికీ తెలియవు. అందులోనూ.. దేన్నీ వదలకుండా.. అంతా నేనే, అన్నీ నేనే అని చెప్పుకునే తీరుతో.. ఈయన మాటల్లో ఏది నిజమో, ఏది అబద్ధమో కూడా అర్థం కాని పరిస్థితి. ఆఖరికి నిన్నలా మొన్న డ్వాక్రా గ్రూపులను ప్రారంభించింది కూడా నేనే.. అనేశాడు చంద్రన్న!

ఎక్కడో బంగ్లాదేశ్ లో 1970లలో పుట్టిన ఈ థీమ్ ను భారతీయులు అందిపుచ్చుకుని.. 1982 లో ఈ పథకాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి డ్వాక్రా కేంద్ర పథకంగానే డ్వాక్రా కొనసాగుతోంది. అయితే బాబు మాత్రం.. ఆ పథకాన్ని నేనే ప్రారంభించా.. అని చెప్పుకోవడాన్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు.  అయితే ఇలాంటి ప్రకటనలు చేయడంలో బాబుగారు ఆరితేరిపోయారు. ఎవరైనా ఏమనుకుంటారనే భయం లేదు.. ఆయన ఏం మాట్లాడినా పతాకశీర్షికల్లో రాసి పెట్టే మీడియా ఉంది.. దీంతో బాబుగారు అలా చెలరేగిపోతున్నారు. అంతే స్థాయిలో నవ్వుల పాలవుతున్నారు.

మరి అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వాలన్నది నేనే.. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసింది నేనే.. హైవేలు నా పుణ్యమే.. సెల్ ఫోన్లను కనుగొన్నది నేనే.. నేనే… అంటూ ప్రతి విప్లవాత్మకమైన ప్రతి వ్యవహారానికీ తనే కారణం అని చెప్పుకుంటున్న బాబు.. ఇవన్నీ లోలోన ఇచ్చిన ఐడియాలు అని కూడా చెప్పుకుంటున్నారు. ఈ సలహాలేవీ ఆయన బహిరంగంగా ఇచ్చిన దాఖలాలు లేవు. అన్నీ ఆయన చెప్పుకోవడాలు మాత్రమే!

ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక సలహాను మాత్రం మీడియా ముఖంగా ఇచ్చారు చంద్రన్న. అదే.. ఐదువందల రూపాయల, వెయ్యి రూపాయల నోట్లను నిషేధిస్తూ వాటి ముద్రణను ఆపేయాలనడం. ఈ మేరకు బాబుగారు లేఖ రాశారు. నల్లధనాన్ని అరికట్టడానికి ఇదో బృహత్తర సలహా అని బాబుగారు చెబుతున్నారు. 

మరి ఇప్పుడేం జరుగుతుంది? ఇది వరకూ ఒకరిద్దరు ఆర్బీఐ గవర్నర్ లు , ఆర్థిక వేత్తలూ ఇదే సలహాను వినిపించారు. అయితే ఇది ఆచరణ సాధ్యం కాదనే మాటానూ వారే చెప్పారు. వారి సలహానే బాబుగారు ఇప్పుడు రైజ్ చేశారు. నల్లధనాన్ని అరికట్టాల్సిందే అంటూ బాబుగారు కేంద్రానికి సూచిస్తున్నారు! 

 ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, ఫైనాన్స్ మినిస్ట్రీ, ఆర్బీఐ.. ఎలా స్పందిస్తాయి? అనేది ఆసక్తికరమైన విషయమే! అనుకూల మీడియాలో అయితే.. బాబు గారి సలహాపై కేంద్రం ఆలోచిస్తోందనే కథనాలు వచ్చే అవకాశాలున్నాయి. బాబుగారు బ్రహ్మాండమైన సలహా ఇచ్చారు.. ఈ దెబ్బతో నల్లధనానికి చెక్ పెట్టినట్టే అవుతుంది.. అంటూ కేంద్ర ఆర్థిక శాఖ ఆలోచిస్తోందని.. ఆర్బీఐ కూడా బాబుగారి సలహాతో బిత్తరపోయింది, బాబు గారి మేధో తనాన్ని చూసి ఆర్బీఐ గవర్నర్ అవాక్కయ్యారు… బాబు గారి సలహాను పాటిస్తామని.. ఆయన అన్నారు! అని తెలుగుదేశం అనుకూల మీడియాలో నేడో, రేపో కథనాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి!

అలా రాయకపోతే.. బాబుగారి లేఖను ఎవరూ పట్టించుకోలేదని అందరికీ అర్థం అయిపోతుంది. కాబట్టి.. అనుకూల మీడియా ఆ మేరకు రాతలు రాస్తుంది. అయితే.. నిజంగానే ఐదొందల, వెయ్యి నోట్లు బ్యాన్ అవుతాయా? అంటే మాత్రం అది సాధ్యం అయ్యే విషయం కాదని ఎవరికైనా ఇట్టే అర్థం అవుతుంది. బాబుగారి కన్నా ముందు.. కొందరు ఆర్బీఐ గవర్నర్లే ఈ విషయంపై ఆలోచించి, ఆ ఆలోచనను పక్కన పెట్టారు. మరి ఇప్పుడు బాబుగారు మొదటి సారి, బహిరంగంగా.. అందరికీ తెలిసేలా.. ఇచ్చిన ఏకైక విప్లవాత్మక సలహా లేఖ ఏమవుతుందో!

Show comments