హైదరాబాద్ ఇంకా ఉమ్మడి రాజధానేనా? ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఉమ్మడి రాజధానిగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ హైదరాబాదును పదేళ్లపాటు వాడుకోవచ్చు. ఇంత గడువు ఎందుకిచ్చారు? విభజన సమయంలో ఆ రాష్ట్రానికి రాజధాని లేదు. అది నిర్మించుకునేందుకు పదేళ్లు పట్టవచ్చని, కాబట్టి అంతవరకు హైదరాబాదును రాజధానిగా వాడుకుంటారని భావించిన అప్పటి యూపీఏ ప్రభుత్వం పదేళ్లు ఉమ్మడి రాజధానిగా చట్టంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఏపీకి హైదరాబాదుతో ఇంక పని లేదేమోననిపిస్తోంది. అలాగని పూర్తిగా లింకు తెగ్గొట్టుకోలేదు.
హైదరాబాదుతో పూర్తిగా తెగదెంపులు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించలేదు. అంటే ఏపీకి హైదరాబాదుతో లింకు ఉందని చెప్పలేం. లేదనీ చెప్పలేం. ఏపీలోని రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో 'తాత్కాలికం' పేరుతో బాబు సర్కారు సచివాలయం, అసెంబ్లీ నిర్మించింది. ముందు సచివాలయం నిర్మాణం పూర్తయి పనిచేయడం ప్రారంభించింది. ఇక అసెంబ్లీ నిర్మాణం దాదాపుగా పూర్తయి తుది మెరుగులు దిద్దుకుంటోంది. వచ్చే నెలలో బడ్జెటు సమావేశాలు జరగబోతున్నాయి.
సచివాలయం కాంప్లెక్సులోనే శాసనసభ, శాసన మండలి భవనాలు నిర్మించారు. ఇవన్నీ పేరుకు తాత్కాలికమే అయినా వందల కోట్లు ఖర్చు చేసి అత్యాధునికంగా నిర్మించారు. ఇక్కడొక విషయం చెప్పుకోవాలి. అసెంబ్లీ భవనాలకు 'ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి' అనే బోర్డులు ఏర్పాటు చేశారు. కాని సెక్రటేరియట్‌ను 'ఆంధ్రప్రదేశ్ సచివాలయం' అని వ్యవహరించడంలేదు. దాన్ని ఇప్పటికీ 'ఇంటరం/టెంపరరీ గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఐజిసి) అని వ్యవహరిస్తున్నారు. మీడియా కూడా ఇదే వాడుతోంది. ఇలా ఎందుకు? ఏమిటీ తేడా? గతంలో ఓ ఆంగ్ల పత్రిక అందించిన కథనం ప్రకారం... సాంకేతికంగా ఏపీ సచివాలయం హైదరాబాదులోనే ఉంది. మరో ఎనిమిదిన్నరేళ్లు అక్కడే ఉంటుందేమో....! అన్నేళ్లు లేకపోయినా అమరావతిలో శాశ్వత సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించేవరకైనా (అవి ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేం) ఏపీ పరిపాలన హైదరాబాదులో ఉన్నట్లే లెక్క. మనం ఇల్లు మారినప్పుడు బంధువులకు, ఆఫీసువాళ్లకు, మున్సిపాలిటీవాళ్లకు, పేపరు వేసేవారికి...ఇలా అనేకమందికి కొత్త చిరునామా తెలియచేస్తాం.
ఇల్లు మారితే వెంటనే చేసే పని అడ్రసు మార్చడం. కాని ఏపీ ప్రభుత్వం ఈ పని చేయడంలేదు. కేంద్ర ప్రభుత్వ శాఖలకు, దాని సంస్థలకు వెలగపూడి చిరునామా ఇవ్వలేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సరే పరిపాలనను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చినప్పుడు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. సంబంధిత శాఖలకు, సంస్థలకు కొత్త అడ్రసు ఇవ్వాలి.కాని ఏపీ సర్కారు ఈ పని చేయకపోవడానికి ఓ కారణముంది. గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి, చిరునామా తెలియచేసిన తరువాత హైదరాబాదుపై సర్వ హక్కులూ పోతాయి. అక్కడ స్థానముండదు. శాశ్వత భవనాలు నిర్మించేంతవరకు లేదా ఉమ్మడి రాజధాని గడువు పదేళ్లు పూర్తయ్యేవరకు ప్రభుత్వం హైదరాబాదును వదులుకోవాలనుకోవడంలేదు. గెజిట్ విడుదల చేయనంతవరకు సాంకేతికంగా హైదరాబాదే రాజధాని. వెలగపూడి నుంచి పరిపాలన సాగుతున్నట్లు దేశమంతా తెలుసు. అయినా ఏం చేసేందుకు అవకాశం లేదట...!
వెలగపూడిలోని సచివాలయాన్ని మొదటినుంచి 'తాత్కాలిక సచివాలయం' అనే వ్యవహరిస్తున్నారు. మీడియాలోనూ అలాగే వాడుతున్నారు. అధికారికంగా దాన్ని ఏపీ సెక్రటేరియట్ అని వ్యవహరించడంలేదు. 'న్యూ గవర్నమెంట్ ట్రాన్సిషనల్ హెడ్‌క్వార్టర్స్ (జిటిహెచ్) అని ప్రభుత్వపరంగా దానికి పేరు. టెంపరరీ/ఇంటరం గవర్నమెంట్ కాంప్లెక్స్ అని కూడా అంటున్నారు. అధికారికంగా ఏపీ సెక్రటేరియట్‌గా వ్యవహరిస్తే చట్టపరమైన ఇబ్బందులొస్తాయట. అసెంబ్లీ కేవలం సమావేశాలు నిర్వహించుకోవడానికే కాబట్టి ఆ భవనాలను అధికారికంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి వ్యవహరించినా ఇబ్బంది ఉండదేమో...!
హైదరాబాదులో ఏపీ వాటాకు వచ్చిన సచివాలయం, అసెంబ్లీ భవనాలను కూడా తెలంగాణ సర్కారుకు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ భవనాలు కావాలని కేసీఆర్ ఎప్పటినుంచో అడుగుతున్నారు. 9,10 షెడ్యూళ్లలోని ఉమ్మడి సంస్థల విభజన పూర్తయ్యాక ఇస్తామని ఏపీ సర్కారు చెబుతోంది. నిజానికి ఏపీకి హైదరాబాదుతో లింకు ఎప్పుడో తెగిపోయింది. అసెంబ్లీ కూడా నిర్మించుకున్నారు కాబట్టి ఇక పనిలేదు. కాని చిన్న సాంకేతిక కారణం చూపించి ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తున్నారు.