విజయశాంతి ఏమయిపోయారు.? ఎక్కడున్నారు.? ఏం చేస్తున్నారు.? తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విజయశాంతి పేరు ఒకప్పుడు గట్టిగానే వినిపించింది. తెలంగాణ సాధన కోసమే ఆమె తల్లి తెలంగాణ స్థాపించినట్లు చెప్పుకున్నారు. పార్టీ నడపలేక దాన్ని టీఆర్‌ఎస్‌లో కలిపేశారు. మాంఛి విందు భోజనం వడ్డించేసరికి, లేచి వెళ్ళిపోయారామె. అవును, నిజ్జంగా నిజమిది. టీఆర్‌ఎస్‌లోనే గనుక ఇంకా విజయశాంతి వుండి వుంటే, ఆమెకు ఎవరూ ఊహించనంత గొప్ప పదవి దక్కేదే.
అదృష్టం తలుపుతడితే, ఛీ అవతలకి పో.. అన్నట్టు తయారయ్యిందిప్పుడు విజయశాంతి పరిస్థితి. రాజకీయాల్లో ఎప్పుడెలాంటి పరిస్థితులు వుంటాయో ఊహించడం కష్టమే. తెలంగాణ ఇచ్చేస్తోంది కాంగ్రెస్ గనుక, అందులోకి వెళితే బెటర్.. అనుకున్న విజయశాంతి, అప్పటి రాజకీయ పరిస్థితుల్ని సరిగ్గా అంచనా వేయలేక బోల్తా పడ్డారు. ఇక, ఆ తర్వాత విజయశాంతి ఒకటీ అరా సందర్భాల్లో తప్ప, ఎక్కువగా ఎక్కడా కన్పించలేదు.
తాజాగా, విజయశాంతి తమిళనాడులో తేలారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను చెన్నయ్‌లోని అపోలో ఆసుపత్రిలో పరామర్శించారు. ఇందులో వింతేముంది.? అనుకుంటున్నారా.! అక్కడే వుంది అసలు కథ. విజయశాంతి తమిళంలో బాగా మాట్లాడగలరు. ఇంకేం, అమ్మ భజనలో మునిగి తేలారామె. ఈ భజన విన్నవారంతా, ఏమో.. తెలంగాణలో రాజకీయం చేసే పరిస్థితి లేకపోవడంతో విజయశాంతి, పొలిటికల్‌గా తన మకాం చెన్నయ్‌కి మార్చేస్తారేమో.. అని అనుకుంటున్నారు.
విజయశాంతితోపాగు, సినీ నటి నగ్మా కూడా జయలలితలను పరామర్శించినవారిలో వున్నారు. నగ్మా, కాంగ్రెస్ నేతగా తమిళనాడు బాధ్యతలు చూసుకుంటున్న విషయం విదితమే.