ఈడీ అటాచ్ మెంట్.. అయితే ఇది కొత్త గా జరిగిందేమీ కాదు. ఇన్ని రోజులూ సీబీఐ అటాచ్ మెంట్ లో ఉన్న జగన్ కంపెనీలకు చెందిన ఆస్తులనే ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. సీబీఐ అటాచ్ చేసిన ఆస్తుల విలువ, ఇప్పుడు ఈడీ అటాచ్ చేసిన ఆస్తుల విలువ దాదాపు సమానం. అదనంగా కొన్ని ఆస్తులను మాత్రమే అటాచ్ చేసింది ఈడీ. దీనిపై తాము కోర్టుకు వెళతామని జగన్ తరపు న్యాయవాదులు చెబుతున్నారు. చార్జిషీట్ లో లేని ఆస్తులను అటాచ్ చేశారని.. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు పేర్కొన్నారు.
ఈ గొడవంతా పక్కనపెడితే.. నాలుగేళ్ల కిందట నుంచి ఈ ఆస్తులన్నీ అటాచ్ మెంట్ లోనే ఉన్నాయి. “సాక్షి’ ఆరంభం అప్పుడు దాని కోసం పక్కన పెట్టిన మూలనిధి కూడా అటాచ్ మెంట్ లోనే ఉంది. దానిపై వచ్చే వడ్డీలతో, అవసరార్థం ఆసొమ్మును ఉపయోగించుకొంటూ సంస్థను నడిపించేందుకు ఏర్పాటు చేసిన డబ్బు దాదాపు నాలుగేళ్ల నుంచి సీబీఐ అటాచ్ మెంట్ లో ఉంది. దాన్నుంచి రూపాయి డ్రా చేయడానికి కూడా అవకాశం లేదు!
మరి అయినా ‘సాక్షి’ ని ఎలా నడిపిస్తున్నారు? ఇంధనంగా ఉపయోగపడుతుందనుకున్న ధనం తోనే సంస్థ ఎలా నడుస్తోంది అంటే... ఆసక్తికరమైన విషయాలే వినిపిస్తున్నాయి. అటాచ్ మెంట్ లో ఉన్న ఆస్తుల నుంచి డబ్బుల అవసరం లేకుండా సాక్షి సర్వైవ్ అవుతోందని సమాచారం.
అనగా.. కొన్ని సంవత్సరాల క్రితమే సాక్షి బ్రేకీవెన్ దశకు వచ్చింది. ఈ విషయాన్ని ఒకసారి స్వయంగా వైఎస్ భారతి ప్రకటించారు. సాక్షి చైర్మన్ గా ఆమె బాధ్యతలు స్వీకరించిన అనంతరం తాము ‘లాభము, నష్టము లేని స్థితికి’ చేరుకున్నట్టే అని ఆమె బోర్డుమీటింగులో ప్రకటించారు. ఆ తర్వాతే సీబీఐ విచారణలో అటాచ్ మెంట్ ప్రకియ మొదలైంది.
దాదాపు నాలుగేళ్ల కు ముందే బ్రేక్ ఈవెన్ దశకు చేరుకున్న సాక్షి ఆ తర్వాత సర్క్యులేషన్ పరంగా ఆటుపోట్లను ఎదుర్కొంటూనే ఉన్నా.. లాభాలను అయితే చూస్తోంది. పత్రికలకు ప్రాధాన ఆదాయ వనరు యాడ్ రెవెన్యూనే. సాక్షికి ఈ ఆదాయం పుష్కలంగా ఉంది. వారాంతాల్లో ఫస్ట్ పేజీ యాడ్స్ దండిగానే వస్తున్నాయి. దీనికితోడు మొదట్లో అడ్డదిడ్డంగా ఖర్చు పెట్టిన సాక్షి యాజమాన్యం తర్వాత ఆ పోకడలో మార్పు తెచ్చింది. ఇలాంటి చర్యలతో ప్రస్తుతం సాక్షి లాభాల స్వీకరణ దశకు వచ్చింది.
బ్రేకీవెన్ దశలోనే కొత్త గా డబ్బుల అవసరం లేకపోయింది, ఇక లాభాల దశకు వచ్చాకా అటాచ్ మెంట్ తో ఇబ్బంది లేదు కదా! దీంతో అటాచ్ మెంట్ ఆస్తులతో సంబంధం లేకుండా.. సాక్షి పత్రిక సర్వైవ్ కాగలుగుతోంది. అది కూడా ఇన్ని రోజులూ సీబీఐ అటాచ్ మెంట్ లో ఉన్నవి, ఈడీ దగ్గరకు వెళ్లాయి తప్ప కొత్తగా జరుగుతున్న నష్టమూ లేదు.
ఇదిలా ఉంటే.. సాక్షి మీడియాలో పేపర్ నుంచి లాభాలు వస్తున్నా.. టీవీ మాత్రం ఇంకా ఖర్చు పెట్టిస్తూనే ఉన్నట్టుగా తెలుస్తోంది. దీన్ని నివారించడానికి చాలా వరకూ మార్పులు తీసుకొచ్చారు.