చేరేది 'ఆప్‌'లోనే...చెప్పేస్తే ఓ పనైపోతుంది...!

రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఏ పార్టీలో చేరుతున్నారు? ఆయన భవిష్యత్తు రాజకీయం ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబుల కోసం రాజకీయ పార్టీలు, మీడియా ఎదురుచూస్తున్నాయి. మూడు రోజుల క్రితం రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేసిన సిద్ధూ తనేం చేయబోతున్నాడో ఇప్పటివరకు చెప్పలేదు. అసలు మీడియా ముందుకు రాలేదు. కాని ఆయన రాజీనామా చేయగానే సిద్దూ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)లో చేరబోతున్నాడహో అంటూ మీడియా హోరెత్తించింది. 

రాజీనామా చేసిన మరుక్షణమే ఆప్‌ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ హర్షం ప్రకటించి, తమ పార్టీలో చేరాల్సిందిగా స్వాగతం పలికారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో జరగబోయే పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దూను ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తారని అనుకుంటున్నారు. దాదాపు ఇది ఖాయమైపోయిందని జాతీయ మీడియా కోడై కూస్తోంది. పంజాబ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కేజ్రీవాల్‌ ఎంతో విశ్వాసంతో ఉన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఆప్‌ తరపున ఎంపీలు ఎన్నికయ్యారు. 

సిద్దూ వస్తే పార్టీకి ఊపొస్తుందని నమ్ముతున్నారు. కొద్ది నెలల క్రితమే రాజ్యసభకు నామినేట్‌ అయిన సిద్దూ హఠాత్తుగా రాజీనామా చేసినట్లు పైకి కనబడుతున్నా ఆప్‌తో ఒప్పందం కుదిరాకే బీజేపీ నుంచి బయటకు వచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన ఆప్‌లో చేరడం ఖాయమైనా శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందన్నట్లుగా సిద్దూ అధికారికంగా ప్రకటిస్తే ఓ పనైపోతుంది. ఈ పని  రేపు (శుక్రవారం) చేయబోతున్నారు. సిద్దూ ఎందుకు నోరు విప్పలేదని మీడియా ఆయన భార్య నవజ్యోత్‌ కౌర్‌ను ప్రశ్నించినప్పుడు 'గురు పూర్ణిమ' సందర్భంగా మౌనవ్రతంలో ఉన్నారని చెప్పారు. ఆమె కూడా అమృతసర్‌ తూర్పు నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 

అంతే కాకుడా పంజాబ్‌ అకాలీదళ్‌-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో చీఫ్‌ పార్లమెంటరీ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఇంకా రాజీనామా చేయలేదు. సిద్దూ ఆప్‌లో చేరేందుకు తేదీ నిర్ణయించకపోయినా రేపు మీడియా సమావేశం నిర్వహించి వచ్చే వారం చేరతారని అనుకుంటున్నారు. ఆయన రాజీనామాకు ప్రధాన కారణం అసంతృప్తేనని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీలో సీనియర్‌ అయినప్పటికీ తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని అభిప్రాయం. ఆయన 2004 నుంచి అమృతసర్‌ (లోక్‌సభ) నుంచి గెలుస్తున్నారు. కాని గత ఎన్నికల్లో పార్టీ ఆయనకు టిక్కెట్‌ ఇవ్వలేదు. అందుకు పరిహారంగా రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. 

గత ఎన్నికల్లో అమృతసర్‌ నుంచి ఆర్ధిక మంత్రి అరుణ్‌ జైట్లీ పోటీ చేశారు. కాని కాంగ్రెసు చేతిలో ఘోరంగా ఓడిపోయారు. తనకు సీటు నిరాకరించి జైట్లీకి ఇవ్వడంతో ఆగ్రహించిన సిద్దూ ప్రచారానికి కూడా వెళ్లలేదు. అంతేకాకుండా అప్పటినుంచి ఇప్పటివరకు అమృతసర్‌లో అడుగుపెట్టలేదట...!  మరో కారణం మంత్రి పదవి ఇవ్వకపోవడమని భావిస్తున్నారు. బీజేపీ ద్వారా సొంత రాష్ట్రమైన పంజాబ్‌కు ఏమీ చేయలేకపోయానని ఆయన ఫీలవుతున్నారట...! ఈ నేపథ్యంలో పంజాబ్‌లో పాగా వేయాలనుకుంటున్న ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌  సిద్దూలోని అసంతృప్తిని కనిపెట్టి తమ పార్టీలో చేరితో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తానని హామీ ఇచ్చారట...!  

లక్కీగా ఆప్‌ గెలిస్తే ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఇంతకుమించి ఏం కావాలి? సిద్దూ ఆల్రెడీ ఆప్‌లో చేరాలని ప్లాన్‌ చేసుకున్న విషయం తెలుస్తూనే ఉన్నా కాంగ్రెసు పార్టీ ఆయన్ని ఆహ్వానించింది. ఆయన రావాలనుకుంటే ఘనస్వాగతం పలుకుతామని కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ చెప్పారు. ఆయన కుటుంబం కాంగ్రెసు పార్టీకి సేవ చేసిందని గుర్తు చేశారు. సిద్దూను కాంగ్రెసులోకి తీసుకొచ్చే విషయమై ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో, సీనియర్లతోనూ మాట్లాడారట. ఇదిలావుంటే, సిద్దూ ఆప్‌ తరపున ప్రధాన ప్రచారకర్తగా ఉంటారని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకపోవచ్చని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. 

ఏది ఏమైనా సిద్దూ వెళ్లిపోవడం వ్యక్తిగతంగా ప్రధాని మోదీకి, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షాకు జీర్ణించుకోలేని విషయం. ఆరేళ్ల రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకొని పోయాడంటే పక్కా ప్రణాళికతోనే వెళ్లాడని అర్థమవుతోంది. పంజాబ్‌ ఎన్నికల్లో ఆప్‌ ఓడిపోయినా సిద్దూ మళ్లీ బీజేపీలోకి వచ్చే అవకాశం లేదు. 'ఆయన ఎప్పటికీ బీజేపీలోకి రాడు' అని భార్య నవజ్యోత్‌ కౌర్‌ చెప్పారు. ఒకప్పటి క్రికెట్‌ స్టార్‌ పంజాబ్‌ పొలిటికల్‌ స్టార్‌ అవుతాడా?

Show comments