చిరంజీవి ఓకే.. పవన్‌కళ్యాణ్‌ నాట్‌ ఓకే.?

ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు, కమెడియన్‌ పోసాని కృష్ణమురళి, మనసులో ఏదున్నా గట్టిగా మాట్లాడేయగలడు. ఆయనకి మొహమాటాలేమీ వుండవు. చాలామంది ఆయన్ని 'మెంటల్‌ కృష్ణ' అంటారు. ఆయన నటించిన సినిమా టైటిలే అది. నిజ జీవితంలోనూ ఆయన తీరు అలాగే కన్పిస్తుంటుంది. ఆయనంతే, ఆయనెవరికీ అర్థం కాడు. కానీ, సినీ రంగంలో ఆయన ప్రముఖ రచయిత. ఇప్పుడంటే స్టార్‌ కమడియన్‌ అయిపోయాడుగానీ, ఒకప్పుడు పోసాని సినిమాలంటే, మాంఛి పవర్‌ఫుల్‌గా వుండేవి. సమాజాన్ని ప్రశ్నించేవి. 

ఇక, పోసాని రాజకీయాల్లోనూ తన ఉనికిని చాటుకోవాలనుకున్నారుగానీ కుదరలేదు. ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారాయన. ఇంకోసారి మళ్ళీ రాజకీయాలవైపు చూసే ఇంట్రెస్ట్‌ లేదంటూనే, చిరంజీవి గనుక ప్రజారాజ్యం పార్టీని పునరుద్ధరిస్తే, ఆయన వెంట రాజకీయాల్లో నడవడానికి తాను సిద్ధంగా వున్నానని పోసాని కృష్ణమురళి ప్రకటించడం గమనార్హం. అన్నయ్య సంగతి పక్కన పెడదాం.. తమ్ముడు పవన్‌కళ్యాణ్‌, జనసేన పార్టీని స్థాపించారు కదా.. అనడిగితే, ఆ పార్టీ ఏంటో నాకైతే అర్థం కాలేదు, అర్థమయ్యాక ఆ పార్టీ గురించి స్పందిస్తా.. అని పోసాని తేల్చి చెప్పేశారు. 

అంటే, ఇప్పటికీ రాజకీయాల్లో చిరంజీవి అంటే పోసానికి మమకారం తగ్గలేదన్నమాట. ఆ మధ్య ఓ సందర్బంలో ప్రజారాజ్యం పార్టీపైనా పోసాని సెటైర్లేశారు. ఆ సమయంలో ఆయన అడుగులు వైఎస్సార్సీపీ వైపుగా పడ్డాయి. ఏమయ్యిందో, మళ్ళీ ఇప్పుడు చిరంజీవి వైపు రాజకీయంగా పోసాని అడుగులు మరోసారి పడుతున్నాయి. అయినా, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పునరుద్ధరించే అవకాశాలున్నాయా.? ఛాన్సే లేదు.

Show comments