ఈసారి సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఎక్కడ.!

పాకిస్తాన్‌లో తీవ్రవాద శిబిరాలపై తొలి సర్జికల్‌ స్ట్రైక్‌ జరిగింది.. ఆ తరువాతి సర్జికల్‌ స్ట్రైక్‌ నల్లధనమ్మీద.. మూడో సర్జికల్‌ స్ట్రైక్‌ దేని మీద.? ఇప్పుడిదే దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. 

ఏపీ, తెలంగాణలో ప్రముఖంగా విన్పిస్తోన్న మాట, 'పార్టీ ఫిరాయింపులపై నరేంద్రమోడీ సర్జికల్‌ స్ట్రైక్స్‌' చేయబోతున్నారని. నిజమేనా.? అంటే, ఏమో.. గుర్రం ఎగరావచ్చు.. పాకిస్తాన్‌పై సర్జికల్‌ స్ట్రైక్‌ జరుగుతుందని ఎవరైనా ఊహించారా.? అసలు, దేశంలో నోట్ల మార్పిడి.. అదీ రాత్రికి రాత్రి జరుగుతుందని ఎవరైనా అనుకున్నారా.? ఆ లెక్కన, పార్టీ ఫిరాయింపులపై నరేంద్రమోడీ సర్కార్‌ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో.! 

రాజకీయాలకు పట్టిన జాడ్యం పార్టీ ఫిరాయింపులు. ఆ మాటకొస్తే, పొలిటికల్‌ క్యాన్సర్‌గా పార్టీ ఫిరాయింపుల్ని భావించొచ్చు. దేశవ్యాప్తంగా ఈ మాయరోగం ప్రజాస్వామ్యాన్ని పట్టి పీడిస్తోంది. 'స్పీకర్‌ విశేషాధికారాలు' అనే పేరు చెప్పి, పార్టీ ఫిరాయింపులనే క్యాన్సర్‌ని అధికార పార్టీలు పెంచి పోషిస్తున్నాయన్నది నిర్వివాదాంశం. న్యాయస్థానాలు సైతం, ఈ క్యాన్సర్‌ని అడ్డుకోలేకపోతున్న దరిమిలా, పార్లమెంటే రంగంలోకి దిగాల్సి వుంటుంది. 

చట్ట సభల్లో పార్టీ ఫిరాయింపులపై చట్టం తీసుకొస్తే తప్ప.. పార్టీ ఫిరాయింపుల్ని నిరోధించడం సాధ్యం కాదు. లోక్‌సభలో కంప్లీట్‌ మెజార్టీ వుంది.. రాజ్యసభలోనూ ఈ అంశంపై బహుశా బీజేపీకి పెద్దగా ఇబ్బందులు వుండకపోవచ్చు. కానీ, మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ ఊరుకుంటుందా.? తెలంగాణ రాష్ట్ర సమితి ఏమంటుంది.? ఎందుకంటే, ప్రస్తుతానికి ఈ రెండు పార్టీలే పార్టీ ఫిరాయింపులనే క్యాన్సర్‌ని పెంచి పోషిస్తున్నాయి మరి.!

Readmore!

Show comments