‘జనసేన’ ఉనికిలో ఉందా? లేదా? అనేది అంత ఈజీగా సమాధానం దొరికే అంశం కాదు. పవన్ కు మూడొచ్చి జనాల ముందుకు వస్తే ఉన్నట్టు లేకపోతే లేనట్టు.. ఇలాంటి పార్టీలు చాలానే ఉన్నాయి కేఏ పాల్ ‘ప్రజాశాంతి’ పార్టీల్లాంటివనమాట. ఇవి ఉన్నాయా లేదా? అనేది చెప్పడం చాలా కష్టం. ఈ పార్టీల అధినేతలు మాత్రం అప్పుడప్పుడు మీడియా ముందు కు వచ్చి మాట్లాడతారు! అది కూడా ఎవరికీ ఏమీ అర్థం కానట్టుగా మాట్లాడి వెళ్లిపోతారంతే.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు మీడియాలో కొత్త కబురు వినిపిస్తోంది అదే పార్టీలకు అతీతంగా “జనసేన’’ పార్టీ అనేది! పవన్ కల్యాణ్ ఏర్పాటు చేసిన ఈ పార్టీని బలోపేతం చేస్తామని పవన్ ఫ్యాన్స్ అంటున్నారట. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా పని చేయాలని ఏదేదో జిల్లా పవన్ ఫ్యాన్స్ అసోషియేషన్ అధ్యక్షుడు పిలుపునిచ్చాడట. మరి పార్టీలకు అతీతంగా ఒక రాజకీయ పార్టీని బలోపేతం చేయడం, ఒక రాజకీయ పార్టీ తరపున సేవలు చేయడం ఏమిటో!
ఒకవైపు పవన్ ఏమో వేరే పార్టీల వాళ్లు తనకు అవసరం లేదు.. సొంతంగా పార్టీ కి నేతలను తయారు చేసుకొంటా అని రెండేళ్ల కిందట ప్రకటించినట్టు గుర్తు. మరి ఆయన ఈ విషయంలో ఏం పరిశ్రమ చేస్తున్నాడో కానీ.. ఏ ఫ్యాక్టరీల్లో తన పార్టీకి నేతలను తయారు చేసుకొంటున్నాడో కానీ.. పవన్ ఫ్యాన్స్ మాత్రం పార్టీలతో పని లేదు.. పవన్ ఫ్యాన్స్ అంతా కలిసి జనసేన కింద పనిచేద్దామంటున్నారట. మరి ఈ విషయం పవన్ కు అయినా తెలిసి జరుగుతోందో లేక తెలీయకుండా జరుగుతోందో! బహుశా.. ప్రజాశాంతి పార్టీ తర్వాత రాజకీయాల్లో ఇంత కన్ఫ్యూజన్ ను సృష్టించిన పార్టీ జనసేన మాత్రమే కాబోలు!