మీడియా మందు పార్టీకి 40 లక్షలు?

తెలుగులోనే కుప్పలు తెప్పలుగా హీరోలున్నారు. వీళ్లే మార్కెట్ షేర్ ను పంచుకుంటూ కిందా మీదా అయిపోతున్నారు. వీళ్లు చాలక పక్క రాష్ట్రం వాళ్లకు కూడా మన మీదకే వస్తున్నారు. కన్నడం, తమిళం, మలయాళం ఇలా అందరికీ మన ఆడియన్స్ నే టార్గెట్. ఇప్పుడు లేటెస్ట్ గా శివకార్తికేయన్ అనే తమిళ నటుడు కూడా తెలుగు మార్కెట్ మీద కన్నేసాడు. 

తన సినిమాను తెలుగులోకి లాంచ్ చేయడానికి భారీగా డబ్బులు కుమ్మేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాట కమెడియన్ గా స్టార్ట్ చేసి, టెలివిజన్ స్టార్ గా, సింగర్ గా మారి, అక్కడి నుంచి హీరో అయ్యారు. లేటస్ట్ గా రెమో అనే సినిమా చేసాడు. తెలుగువారికి పరిచయం అయిన కీర్తి సురేష్ హీరోయిన్. ఈ సినిమాలో శివకార్తికేయన్ కొంత భాగం అమ్మాయిలా కూడా కనిపిస్తాడు. 

సరదాసరదాగా సాగిపోయే కథ కాబట్టి తెలుగువారికి కూడా నచ్చుతుందని ఆశిస్తున్నారు. అయితే తెలుగులోకి తనే తీసుకురావాలని శివకార్తికేయన్ సంకల్పం.  గీతా, యువి, ఇలాంటి సంస్థలను సంప్రదించి ఆఖరికి దిల్ రాజు దగ్గర సెటిల్ అయినట్లు బోగట్టా. అంటే ఖర్చు అంతా శివకార్తికేయన్ ది. బ్యానర్ మాత్రం దిల్ రాజుది అన్నమాట. 

ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ కోసం శివకార్తికేయన్ భారీగా ఖర్చు చేస్తున్నట్లు వినికిడి. సాధారణంగా దిల్ రాజు అయితే ఇలా చేయరు. పైగా నిన్నటికి నిన్న పార్క్ హయాత్ లాంటి భారీ హోటల్ లో మీడియాకు మందు పార్టీ. దిల్ రాజు సినిమా ఏంటీ? పార్క్ హయాత్ లో మందుపార్టీ ఏంటీ అన్న అనుమానాలు ఇండస్ట్రీలో వినిపించాయి. ఆచూకీ తీస్తే, సొమ్ము కార్తికేయన్ ది అన్న సమాచారం అందుతోంది. 

ఈ కాక్ టైల్ ఫార్టీకి జస్ట్ నలభై లక్షలు ఖర్చయిందని విశ్వసనీయ వర్గాల బోగట్టా. ఓం ప్రధమం అంటూ కాక్ టైల్ పార్టీకే నలభై లక్షలు ఖర్చు చేసిన శివకార్తికేయన్ సినిమా ప్రమోషన్ కు ఇంకెంత ఖర్చు చేస్తారో?

Show comments