పవన్‌, చంద్రబాబు.. 'ఏకాంత' చర్చల వెనుక.!

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో, జనసేన అధినేత, సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ భేటీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. 'రాజకీయం ఏమీ లేదు.. మానవత్వం మాత్రమే..' అంటూ 'ఉద్దానం కిడ్నీ సమస్య'కు సంబంధించి పవన్‌కళ్యాణ్‌, చంద్రబాబు 'అత్యున్నతస్థాయిలో' పొలిటికల్‌ 'డ్రామా' నడిపిస్తున్నారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. 

మూడు దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంత ప్రజానీకం కిడ్నీ సమస్యలతో సతమతమవుతోంది. ఈ ముప్ఫయ్యేళ్ళలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసింది 12 ఏళ్ళకు పైనే. కానీ, ఆ కిడ్నీ సమస్య ఉద్దానం ప్రాంతాన్ని అలాగే పీడిస్తూనే వుంది. ఎలాగైతేనేం, ఇప్పుడీ సమస్య మరింత హైలైట్‌ అయ్యింది పవన్‌కళ్యాణ్‌ పుణ్యమా అని. పరిష్కారం దొరికితే సరేసరి.. లేదంటే, దీన్నొక పొలిటికల్‌ డ్రామాగానే ఫిక్సయిపోవాల్సి వుంటుంది. 

ఇక, చంద్రబాబుతో పవన్‌కళ్యాణ్‌ భేటీ అవడానికి సంబంధించి సరైన కారణం ఇన్నాళ్ళకు దొరికిందనుకోవాలి. అదే 'ఉద్దానం కిడ్నీ సమస్య'. ఆ సంగతి పక్కన పెడితే, పవన్‌ - చంద్రబాబు 'ఏకాంతంగా భేటీ' అయ్యారట. ఇదిప్పుడు రాజకీయాల్లో మరింత తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. ఓ పక్క నంద్యాల ఉప ఎన్నిక, ఇంకోపక్క కాపు రిజర్వేషన్‌ వివాదం.. వీటన్నిటికీ తోడు, వైఎస్‌ జగన్‌ 'నవరత్నాలు' టీడీపీని కలవరపెడ్తున్న వైనం.. ఈ పరిస్థితుల్లో పవన్‌ - చంద్రబాబు భేటీ, రాజకీయంగా చర్చనీయాంశమవడంలో వింతేమీ లేదు. 

నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి పవన్‌కళ్యాణ్‌ని ప్రచారానికి తీసుకెళ్ళాలన్న ఆలోచన చంద్రబాబుకి వుంటే వుండొచ్చుగాక. కానీ, పవన్‌ అందుకు సుముఖత వ్యక్తం చేయరు. పవన్‌ని ప్రసన్నం చేసుకుంటే చాలు, ప్రచారానికి వచ్చినా రాకపోయినా ఎంతో కొంత కలిసొస్తుందన్నది చంద్రబాబు ఆలోచన. మరోపక్క, కాపు సామాజిక వర్గం రిజర్వేషన్ల రగడ - ముద్రగడ ఆందోళనల కారణంగా టీడీపీకి దూరమవకూడదంటే పవన్‌ని అక్కున చేర్చుకోవాలి. అదీ ఇప్పుడు జరిగిపోయింది.! 

సో, ఏకాంత చర్చల పేరుతో చంద్రబాబు, కొంతమేర 'ప్రశాంతత' పొందరనే అనుకోవాలి. అయితే, ఇవన్నీ రాజకీయంగా చంద్రబాబుకి ఉపశమనం కలిగిస్తాయా.? అన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.

Show comments