ఆ పాపం చంద్రబాబును ఇంకా వెన్నాడుతోందా?

చేసిన పాపం చెబితే పోతుందంటారు. కానీ కొన్ని మహా పాపాలు ఉంటాయి. అవి చెప్పుకున్నా కూడా పోవు. వెన్నాడుతూనే ఉంటాయి. అయినా మనం చేసే తప్పుల విషయంలో వాటిని సమర్థించుకుంటూ బయటి వాళ్లకు ఎలాగైనా మాయ మాటలు చెప్పి బురిడీ కొట్టించవచ్చుగానీ.. మన ఆత్మసాక్షికి మనం జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది. 

ఆ ఆత్మసాక్షి దృష్టిలో చేసిన పాపం.. మనల్ని ఎన్నటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విషయంలోనూ ఈ సిద్ధాంతం నిజమే. అధికార్ల నివేదికలు, జనానికి చెప్పిన వివరణలు ఎలా ఉన్నప్పటికీ.. తన ఆత్మసాక్షి నుంచి ఆయన తప్పించుకోలేకపోతున్నట్లుంది. గోదావరి పుష్కర ప్రారంభం రోజున దుర్మరణాలు ఆయనను ఇంకా వెన్నాడుతున్నట్లు కనిపిస్తోంది. 

చంద్రబాబునాయుడు షూటింగ్‌ కు అనుకూలంగా జనాన్ని కట్టడి చేయడం.. పర్యవసానంగా తొక్కిసలాట, ఆ తాకిడికి జనం చచ్చిపోవడం అప్పట్లో జరిగింది. తన షూటింగుకు మరణాలకు ఎలాంటి సంబంధం లేదన్నట్లు చంద్రబాబు ఇప్పటికే చాలా సార్లు వివరణలు ఇచ్చుకున్నారు. కానీ ఆయనలో ఆ పాపభీతి ఇంకా తొలగినట్లు లేదు. అందుకే ఇప్పటికీ అదే వివరణలతో కాలం గడుపుతున్నారు. 

తాజాగా కృష్ణాపుష్కరాల ముగింపు సమయంలోనూ అదే మాట వల్లిస్తున్నారు. గోదావరి పుష్కర ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయిన ఓమహిళను చంద్రబాబు ఓదార్చినప్పుడు.. 'మీ పొరబాటు ఏమీ లేదని ' ఆమె చెప్పిందంటూ చంద్రబాబు మురిసిపోయారు. అసలు ఆమె పరామర్శకు వెళ్లిన సీఎంతో, ఆయన పొరబాటు గురించి ప్రస్తావించింది అంటేనే అసలు విషయం అర్థమైపోతోంది. 

ఆ ప్రమాదానికి సంబంధించిన పాపభీతి ఇప్పటికీ చంద్రబాబులో ఉన్నది గనుకనే.. ఆయన ఏడాది తర్వాత కూడా దానికి వివరణ ఇచ్చుకుంటూ ఉన్నారు. జరిగిందేదో జరిగిపోయింది.. ఆ ప్రమాదం నుంచి పాఠాలు నేర్చుకుని ప్రచార ఆర్భాటాలను తగ్గించుకున్నారా అంటే.. అలాంటిదేమీ జరగలేదు. కృష్ణా పుష్కరాల్లో కాసిని ఎక్కువ సొమ్ములు తగలేసి ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని, ఇతర మార్గాల్లో.. అంతకంత భారీ ప్రచారం దక్కేలా వ్యవహారాలు నడిపించారు మరి!

Show comments