అయినా.. ప్రధానమంత్రి ని జగన్ వెళ్లి కలిసినప్పుడే, వారిద్దరే సమావేశం అయినప్పుడు.. ఏం జరిగిందో కూడా.. ఇట్టే చెప్పేయగల పత్రికలకు, చంద్రబాబును రాష్ట్రపతి ఏయే విశేషణాలు వాడి పొగిడాడో కూడా విపులంగా చెప్పగల ఈ పత్రికలకు తుని రైలు ఘటన కేసు విచారణ అంశంలో ఏమేం జరుగుతున్నాయో చెప్పడం కష్టం కాదు కదా!
ఇంతకీ పచ్చమీడియా ఏం చెబుతోందంటే.. తుని ఘటనలో భూమన పాత్ర కు సంబంధించి కీలక ఆధారాలు దొరికాయని, దీంతోనే విచారణ వేగవంతం అయ్యిందని.. ప్రత్యేకించి భూమన ఫోన్ సంభాషణలు ఈ కేసులో కీలక ఆధారాలు అని పచ్చమీడియా తన కథనాల్లో వండి వారుస్తోంది!
మరి ఇప్పుడా.. ఇంకా తునిలో రైలు మంటలు ఆరాకముందే.. ఇంకా రైలు మండుతున్నట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి ఈ దహనం జగన్, జగన్ మనుషులదే అని తేల్చి చెప్పాడు. అప్పట్లోనే పచ్చపత్రికలు ఈ మేరకు కథనాలు రాసుకొచ్చాయి.. భూమనకు సంబంధం ఉందని తేల్చేశాయి. అయితే అప్పుడు ఎఫ్ఐఆర్ లో ఏ1, ఏ2, ఏ3ల్లో ఎక్కడా భూమన పేరు ఎందుకు లేదు? ఇప్పుడు కూడా ఏ1, ఏ2 లను ఇంతవరకూ విచారణకు పిలవకుండా.. భూమననే ఎందుకు పిలుస్తున్నారు? అనే ఆలోచనలు మనకు రాకూడదు! అలా ఆలోచించే వారు ఎవరైనా ఉన్మాదులే అని ఏపీ సీఎం సర్టిఫై చేయగలడు.
ఇక ఈ వ్యవహారంలో పచ్చమీడియా మాటల్లో, రాతల్లో తరచూ వినిపించే మాట “భూమన ఫోన్ సంభాషణలు’’.. ఇది వీరి చేతిలో బ్రహ్మాస్త్రం. ఈ విషయంలో రాతలు ఎలా ఉంటాయంటే.. భూమన తునిలోని తన మనుషులకు ఫోన్ చేసి.. “అంటించండ్రా..’’ అని ఆదేశించినట్టుగా ఉంటాయి. మరి ఈ కేసు విచారణ గురించి విచారణ కమిటీ కన్నా ముందే దూసుకపోయిన పచ్చ మీడియా ఈ ఫోన్ రికార్డింగ్స్ ను ఎందుకు వినిపించడం లేదు!
తుని ఘటన గురించి విచారణ జరుపుతున్న వాళ్లు అయినా.. ఈ ఫోన్ రికార్డింగ్స్ ను ఎందుకు వినిపించడం లేదు! మరి ఊరికే ప్రతి సారీ “భూమన ఫోన్ సంభాషణలు.. ‘’ అని చెప్పుకురావడం కన్నా, ఒకసారి ఆ ఫోన్ సంభాషణలేమిటో వినిపించేస్తే.. భూమన విషయంలో అందరికీ ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా! ఇదంతా జగన్ కుట్ర అని తేలిపోతుంది కదా! ఆ తర్వాత తీరిగ్గా కోర్టుల్లో విచారణ చేయించవచ్చు కదా!
అది మాత్రం జరగదు. ఏదో పబ్బం గడుపుకోవడానికి .. ఎప్పటికప్పుడు ప్రతిపక్షంలోని వారిని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ గేమ్ లో పెయిడ్ మీడియాతో సహా ఎవరి పాత్ర వారు పోషిస్తూ ఉంటారంతే!