ముద్రగడకు దాసరి మద్దతెంత.?

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, మాజీ కేంద్ర మంత్రి, సినీ ప్రముఖుడు దాసరి నారాయణరావుపై చాలా ఆశలే పెట్టుకున్నారు. కాపు ఉద్యమానికి దాసరి నారాయణరావు పూర్తిస్థాయిలో అండదండలు అందిస్తారన్నది ఆయన ఆశ. అయితే, దాసరి మద్దతు కేవలం మాటలకే పరిమితమవుతోంది. ముద్రగడ రాజమండ్రిలో నిరాహార దీక్ష చేస్తే, ఆసుపత్రులోనూ ఆయన దీక్ష కొనసాగిస్తున్నా.. హైద్రాబాద్‌లో ప్రెస్‌మీట్లతో సరిపెట్టారు దాసరి నారాయణరావు. 

మామూలుగా అయితే, ఇలాంటి సందర్భాల్లో ఓ ప్రతినిథి బృందం దీక్షలు చేస్తున్నవారికీ, ప్రభుత్వానికీ మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తుంటుంది. దురదృష్టవశాత్తూ ముద్రగడకు అలాంటి మద్దతు లభించని పరిస్థితి. 'నేను ఒంటరిని.. నేను అనాధని..' అంటూ ముద్రగడ ఇప్పటికీ నెత్తీనోరూ బాదుకుంటున్నారు. చిరంజీవి ఎటూ సైడయిపోయారు.. మరి, దాసరి నారాయణరావు సంగతేంటి.? 

రేపు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి వెళ్ళి, ముద్రగడ పద్మనాభంను ఆయన నివాసంలో దాసరి కలుస్తారట. ఇది పరమ రొటీన్‌ వ్యవహారం. అవసరమైన సమయంలో, అవసరమైన విధంగా స్పందించాల్సింది పోయి, ముందస్తు భేటీలో, ఆ తర్వాత దూరంగా ప్రెస్‌మీట్లు పెట్టడంలో దాసరి ఆంతర్యమేంటో అర్థం కావడంలేదు. 

'నా అనుభవం అంత లేదు జగన్‌ వయసు..' అన్న ఒక్క మాటతో, వైఎస్సార్సీపీలోని కాపు నేతలకు దూరమైపోయారు ముద్రగడ పద్మనాభం. లేదంటే పరిస్థితి ఇంకోలా వుండేది. 'నన్ను అంత లైట్‌ తీసుకున్నాక, మీరెందుకు సీన్‌లోకి వెళ్ళడం, లైట్‌ తీసుకోండి.. దూరం నుంచి మద్దతిచ్చి ఊరుకోండి.. మీడియా ద్వారా కొంచెం ఫోకస్‌ ఇద్దాం లే..' అని జగన్‌ కూడా లైట్‌ తీసుకున్నారు. దాసరి మాత్రం, మాటలు కోటలు దాటేసేలా వ్యవహరిస్తున్నారు. ఆయన ఓ అడుగు ముందుకేయని పరిస్థితి. 

ఇంకోసారి నిరాహార దీక్ష చేయడమా.? లేదంటే కొత్త మార్గంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమా.? అని ముద్రగడ కిందా మీదా పడ్తోన్న వేళ, ఆయనతో దాసరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకునే విషయమే. అయితే దాసరి తనకు ఇస్తున్న మద్దతు విషయంలో ఓ క్లారిటీతో వున్న ముద్రగడ, దాసరిని అంత గట్టిగా నమ్మే పరిస్థితులైతే లేవు. ఇక్కడ, ఎవరి పరిమితులు వారికి వున్నాయి. అన్నిటికీ మించి కాపు సామాజిక వర్గంలో ఐక్యత హుష్‌కాకీ అయిపోయింది. అందుకే ముద్రగడ ఒంటరి పోరు మాటెలా వున్నా, కాపు రిజర్వేషన్ల ఉద్యమం అనాధగా మారిపోయింది.

Show comments