కథ ముగిసింది...కుమిలిపోతోంది...!

సామాన్య మానవుడు కావొచ్చు, రాజకీయ నాయకుడు కావొచ్చు. ఎవరి జీవితం ఏ మలుపులు తిరుగుతుందో, చివరకు ఎలా ముగుస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. దివంగత జయలలిత ప్రియనేస్తం శశికళ నటరాజన్‌ది ఇదే పరిస్థితి. జయలలిత మరణించగానే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టి పార్టీని గుప్పిట్లో పెట్టుకోవాలని, ముఖ్యమంత్రి పీఠం అధిష్టించి ప్రభుత్వాన్ని నడిపించాలని కలలు కన్న శశికళ చివరకు జైలుకెళ్లింది. తాను జైలుకెళ్లినా తన అక్క కుమారుడు దినకరన్‌ కథ నడిపిస్తాడని, పార్టీ ,ప్రభుత్వం తన కనుసన్నల్లోనే నడుస్తాయని అనుకుంటే చివరకు అతను లంచం కేసులో పోలీసులకు చిక్కి, అరెస్టయి రేపో మాపో జైలుకెళ్లే స్థితిలో ఉన్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో శశికళ కుమిలిపోతున్నట్లు సమాచారం. మంగళవారం రాత్రి ఆమె భోజనం చేయలేదు. జైలు సిబ్బంది దినకరన్‌కు సంబంధించిన సమాచారం అందించగానే ఆమె కుప్పకూలిపోయింది. తన సెల్లో సీలింగ్‌కేసి మౌనంగా చూస్తూ ఉండిపోయింది. బుధవారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ చేయలేదు. 'అమ్మా మీకు బీపీ, షుగర్‌ ఉన్నాయి. బ్రేక్‌ఫాస్ట్‌ చేయకుండా ఉండకూడదు' అని జైలు డాక్టర్లు చెప్పారు. కాని ఆమె వినలేదు. 'నాకు తినే మూడ్‌ లేదు' అని చెప్పింది.

వారం రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన బ్రోకర్‌ సుఖేష్‌ చంద్రశేఖర్‌ విచారణలో దినకరన్‌ పేరు చెప్పాడనే సమాచారం విన్నప్పటినుంచే శశికళ ప్రవర్తన మారిపోయింది. ఈ ఘటనకు ముందు ఆమె ఎంతో నిబ్బరంగా ఉంది. దినకరన్‌ గురించిన వార్తలు చెవుల్లో పడుతున్నప్పటికీ ఏం కాదులే అన్నట్లుగా ఉండేది. ఎప్పుడైతే దినకరన్‌ అరెస్టు అయ్యాడో అప్పటినుంచి ఆమె పూర్తిగా విషాదంలో కూరుకుపోయింది. తనకు అన్ని తమిళ, ఆంగ్ల దినపత్రికలు కావాలని  జైలు సిబ్బందిని అడిగింది. అంతకుముందు మంగళవారం తాను జైలుకు వచ్చి మాట్లాడతానని శశికళకు దినకరన్‌ సమాచారం అందించాడు. కాని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంతో శశికళకు తీవ్ర ఆవేదన కలిగింది. అన్నాడీఎంకేలోని సీఎం పళనిసామి, పన్నీరు శెల్వం వర్గాలు విలీనం కోసం చర్చలు ప్రారంభించినప్పుడు అన్నాడీఎంకేలోని (శశికళ వర్గం) ముఖ్య నాయకులు చిన్నమ్మను కలుసుకోవాలని జైలు బయట ఎదురు చూసేవారు. వారిలో కొందరితో చిన్నమ్మ మాట్లాడేది. కాని పరిణామాలు వేగంగా మారుతున్న క్రమంలో జైలుకు వచ్చే నాయకులు తగ్గిపోయారు.

శశికళను ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగిస్తూ పళనిసామి వర్గం తీర్మానం చేసినప్పటినుంచి జైలుకు వచ్చేవారు ఎవరూ లేకుండాపోయారు. 'గత వారం రోజులుగా ఒక్కరు కూడా చిన్నమ్మను చూడటానికి రాలేదు. దీంతో ఆమె అసహనంగా, ఆవేదనగా ఉంది' అని జైలు అధికారులు చెప్పారు. కేసు నుంచి దినకరన్‌ బయటపడతాడని, పార్టీ ఆయన నియంత్రణలో ఉంటుందని శశికళ ఆశించింది. కాని అతన్ని అరెస్టు చేశాక ఆమె పూర్తిగా డీలా పడిపోయింది. ఒక్కసారిగా షాక్‌ తగిలినట్లయింది. ఏం చేయాలో ఆమె అర్థం కావడంలేదు. ఆమెతో మాట్లాడేవారు, సలహాలు ఇచ్చేవారు ఎవ్వరూ లేరు. ఆమె జైలు భోజనం తినడంలేదు. బెంగళూరులోని ఓ అన్నాడీఎంకే నాయకుడు తన ఇంట్లో భోజనం తయారుచేయించి తీసుకొచ్చి ఇస్తున్నాడు. కాని వారం రోజులుగా అతను భోజనం తేవడంలేదు. అతను భోజనం తెస్తాడో, తేడో చెప్పలేమని జైలు అధికారులు చెప్పారు.

శశికళ జైలుకు వచ్చిన తరువాత నెల రోజులపాటు తమిళనాడు నుంచి వందలాదిమంది అన్నాడీఎంకే నాయకులు, మంత్రులు జైలుకొచ్చారు. తాము అండగా ఉంటామని, అధైర్య పడొద్దని చెప్పారు. అన్నాడీఎంకే నాయకుల రాక కారణంగా జైలు పరిసరాల్లోని హోటళ్లన్నీ కిటకిటలాడేవి. తమకు వ్యాపారం బాగా జరుగుతోందని హోటల్‌ యజమానులు మురిసిపోయారు. కాని ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తమిళనాడు నుంచి వచ్చేవారు లేక హోటళ్లలో బిజినెస్‌ తగ్గిపోయిందట...!

దినకరన్‌ జైలుకెళ్లితే, అన్నాడీఎంకేలోని రెండు వర్గాలు కలిసిపోయి సర్దుబాట్లు చేసుకుంటే శశికళను ఎవ్వరూ గుర్తు పెట్టుకోరని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఆమెను మీడియా మర్చిపోతుంది. సొంత జనమూ మర్చిపోతారు. జయలలిత కన్నుమూసే వరకు ఆమె భక్తాగ్రేసరులైన, పాదాక్రాంతమైన నాయకులంతా ఆమె ప్రాణం పోయిందని తెలియగానే చిన్నమ్మకు దాసానుదాసులైపోయారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోకముందే భజన ప్రారంభించారు. భజన ప్రారంభమే 'హైపీచ్‌'లో జరిగింది. ఆమె ముఖ్యమంత్రి అయితే ఇంకెంత పతాకస్థాయికి వెళుతుందో అనిపించింది. శశికళ పాతాళానికి దిగజారడంతో అన్నాడీఎంకే నాయకుల భజన ఆగిపోయింది. పార్టీ కార్యాలయంలో ఆమె ఫోటోలు, బ్యానర్లు తొలగించి కథను పరిసమాప్తం చేశారు.

Show comments